తపాలా శాఖ ముందంజ
డిజిటల్ లావాదేవీలు పెంచే దిశగా యాప్
గూగుల్ పే, ఫోన్‌పేలకు దీటుగా రూపకల్పన
డాక్ పే లావాదేవీలపై గ్రీవెన్స్ వెసులుబాటు
సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ 155299
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దేశంలో వినియోగ దారులకు సత్వర సేవలు అందించేందుకు తపాలాశాఖ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, కొరియర్, స్పీడ్ పోస్ట్‌తోపాటు బ్యాంకింగ్, గోల్డ్ బాండ్, బీమా తదితర సేవలను ప్రైవేటు సంస్థలకు దీటుగా దిగ్విజయంగా అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి డిజిటల్ లావాదేవీల పెంపునకు గూగుల్ పే, ఫోన్ పే మాదిరిగా డాక్ పే అనే యాప్‌ను 2021లోనే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని ప్రజలకు చేరువ చేసే దిశగా దూసుకెళుతోంది.
ఈ డాక్ పే ద్వారా ప్రజలు డిజిటల్ ఫైనాన్స్ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, అందించే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, డిజిటల్ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం లాంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రతి భారతీయుడి అవసరాలను తీర్చేలా డాక్ పే యాప్‌ను రూపొందించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా దీనిని ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నారు. ఈ యాప్‌ను ఏ బ్యాంకు ఖాతాదారుడైనా వినియోగించవచ్చు.
గ్రీవెన్స్ వెసులుబాటు
గూగుల్ పే, ఫోన్ పే నగదు లావాదేవీల్లో ఏవైనా పొరపాట్లు చోటుచేసుకుంటే ఫిర్యాదులు చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాటి కార్యాలయాలు మనకు అందుబాటులో ఉండవు. అయితే డాక్‌పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫిర్యాదుల స్వీకరణకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. డాక్ పే అనే యాప్ తపాలాశాఖ కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోనే పనిచేస్తుండడంతో మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది. యాప్ గురించిన సమగ్ర సమాచారం కోసం ఐపీపీబీ టోల్‌ఫ్రీ నంబర్ 155299ను వినియోగదారులు సంప్రదించొచ్చని తపాలా శాఖా అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment