2019కు ముందు ప్రభుత్వాస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు
సరిపడా వైద్యులు, నర్సులు లేక ఆయాలే ప్రసవాలు చేసిన దుస్థితి
సీఎం జగన్ వచ్చాక పెద్ద ఎత్తున పోస్టుల భర్తీతో మెరుగుపడ్డ వైద్య సేవలు
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో వైద్య రంగ విస్తరణకు అవకాశం
ఆరోగ్యశ్రీ బలోపేతంతో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం
ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష ముఖ్యమంత్రి చలవే
ఆస్పత్రులకు పుష్కలంగా మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వైద్య విద్య మాజీ అదనపు సంచాలకులు డాక్టర్ విఠల్‌రావు
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు వచ్చాయని వైద్యవిద్య పూర్వపు అదనపు సంచాలకులు (ఏడీఎంఈ) డాక్టర్ నత్తా శ్రీనివాస విఠల్‌రావు చెప్పారు. 2019కు ముందు ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు ఎంతో అధ్వానంగా ఉండేవని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ నుంచి ఏడీఎంఈ వరకూ వివిధ హోదాల్లో 35 ఏళ్ల పాటు వైద్య శాఖలో పనిచేసిన తాను ఎన్నడూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూడలేదన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేకుండా పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రంగంలో వచి్చన మార్పులు, వాటి ఫలితంగా మెరుగుపడిన వైద్య సేవలు తదితర అంశాలపై విఠల్‌రావు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అప్పట్లో ప్రసవాలకు ఆయాలే దిక్కు..
2019కు ముందు వరకూ ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతో దారుణమైన పరిస్థితులను మేం చూశాం. తీవ్రమైన మానవ వనరుల కొరత ఉండేది. పిల్లల వైద్య విభాగంతో పాటు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండేది. విజయవాడ జీజీహెచ్‌లో పిల్లల వైద్య విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ (విభాగాధిపతి)గా పనిచేశాను. వైద్య పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పంపినా అప్పట్లో పట్టించుకునే వారు కాదు. ఉన్నతాధికారులను ఎప్పుడు అడిగినా ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉందనే సమాధానాలే మాకు ఎదురయ్యేవి.
అప్పట్లో ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులకు ఒక ఉదాహరణ చెబుతా.. విజయవాడ జీజీహెచ్ గైనిక్ విభాగంలో పేషెంట్ లోడ్ విపరీతంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన విభాగంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు సరిపడా ఉండేవారు కాదు. ఒక్కోసారి లేబర్ రూమ్‌లో ఒక స్టాఫ్ నర్సు, మిగిలిన నాలుగైదు వార్డులకు ఒక స్టాఫ్ నర్సు ఉండాల్సి వచ్చేది. వైద్యులు సరిపడా లేకపోవడంతో ఏఎన్‌ఎంలు, ఆయాలే ప్రసవాలు చేసేవారు.
ప్రజలకు తప్పిన వ్యయ ప్రయాసలు..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను మన రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలందిస్తున్నారు. ఇది ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవం అనే చెప్పొచ్చు. పల్లెల్లో రైతులు, కూలిపనులు చేసుకునే నిరుపేదలు తమకేదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఒక రోజంతా ఉపాధిని వదులుకుని వ్యయ ప్రయాసలతో ఆస్పత్రులకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు.
వైద్యులే గ్రామాలకు వెళ్తుండడంతో చాలావరకు జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించడంతోపాటు సకాలంలో వైద్య సేవలందుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు చాలావరకూ ఆస్పత్రులకు వెళ్లే అవసరాలు తప్పాయి. అంతేకాక.. ఈ ప్రభుత్వంలోనే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఈవెనింగ్ క్లినిక్‌లు కూడా ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ప్రజలకు చాలా మేలు చేకూరుతోంది. ఎందుకంటే సాధారణంగా పెద్దాస్పత్రులకు దూర ప్రాంతాల నుంచి బాధితులు వస్తుంటారు. వారికి ఉదయం ఓపీ చూసిన వైద్యుడు ఏవైనా పరీక్షలకు సిఫారసు చేస్తే ఆ ఫలితాలు సాయంత్రానికి వస్తాయి. ఈవెనింగ్ క్లినిక్‌కు హాజరయ్యే వైద్యులు ఫలితాలను విశ్లేíÙంచి మందులు ఇవ్వడం లేదా వార్డులో అడ్మిట్ చేయడం వంటివి చేస్తున్నారు.
అడిగిన పోస్టు లేదనకుండా భర్తీ..
2019 తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు సమూలంగా మారడానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత సమస్య పరిష్కారం కావడం. ప్రభుత్వాస్పత్రిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ పాలసీని తెచ్చి 2019కి ముందు వరకూ ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు, పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త విభాగాల ఏర్పాటు, పెద్ద ఎత్తున పోస్టులు మంజూరు చేసి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యుల నుంచి క్లాస్‌ఫోర్ ఉద్యోగుల వరకూ ఏ విభాగంలో అయినాసరే అడిగిన పోస్టు కాదనకుండా భర్తీ చేశారు. ఇప్పుడు వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో ఎక్కడికక్కడ సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
రోగులకు వైద్యసేవల కల్పన మెరుగుపడింది. అంతేకాదు.. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు పుష్కలంగా ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకప్పుడు పీజీ సీట్ల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేస్తే వసతులలేమి కారణంగా మంజూరయ్యేది కాదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ, అన్ని రకాల వసతుల కల్పన వల్ల గణనీయంగా పీజీ సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment