టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటూ రెండేళ్ల కిందటి ఫొటోలను తీసుకొచ్చి మంగళవారమే జరిగినట్టుగా ప్రచురించిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక ఎందుకింతలా దిగజారిపోతోంది? ఒక పార్టీపై బురద జల్లడానికి.. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి... పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి... ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెండేళ్ల కిందటి ఫొటోలు ఇవ్వాల్టివేనని అబద్ధాలు చెబుతూ ప్రచురించే స్థాయికి ఎందుకు పడిపోయింది? అసలిలాంటి పత్రికను ఎవరైనా నమ్మొచ్చా? చంద్రబాబును అధికార పీఠంపైకి తేవటం కోసం ఈ రాష్ట్రాన్ని ఏం చేసినా ఫర్వాలేదనుకునే రామోజీరావు మనస్తత్వాన్ని క్షమించవచ్చా?
‘పట్టాభినీ కొట్టారు’ అంటూ పతాక స్థాయిలో వేసిన శీర్షికలోనే కాదు... ఆ వార్తలో ప్రతి అక్షరం అబద్ధాలతో కూడిన కాలకూట విషమే. అసలు పట్టాభిని కొట్టనే లేదని పోలీసులు కోర్టులో చెబితే... దాన్ని వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తే... కొట్టారంటూ ‘ఈనాడు’లో వార్తలేంటి? పైపెచ్చు... ‘తీవ్రంగా కొట్టారు. అరచేతిపైనా, కాళ్లపైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారంట దుర్మార్గపు రాతలేంటి?
ఆ రాతలన్నీ నిజమని నమ్మించటానికి వాటికి రుజువులుగా ఎప్పుడో రెండేళ్ల కిందట ‘2021 ఫిబ్రవరి 3న’ తన పత్రికలోనే వేసిన ఫొటోలను మళ్లీ ఇప్పుడు వేసేసిన దౌర్భాగ్యపు పరిస్థితేంటి? అంటే... మీ దృష్టిలో మీ పాఠకులంతా వెర్రివాళ్లా రామోజీరావు గారూ? మీరు ఏం రాసినా నమ్మేస్తారనే భ్రమల్లోనే ఇంకా బతుకుతున్నారా? అదంతా ఒక చరిత్ర అని... ‘సాక్షి’ రాకముందు కొన్నాళ్లపాటు తెలుగు పత్రికారంగం ఎదుర్కొన్న సంధికాలమని ఇప్పటికీ తెలియటం లేదా? ‘సాక్షి’ ఆవిర్భవించిన నాటి నుంచీ మీ ఏకఛత్రాధిపత్యానికి కాలం చెల్లిందని... వార్తలకు రెండోవైపున ఏమున్నదో కూడా జనం చూస్తున్నారని మరిచిపోయారా? ఇంటర్నెట్ వేదికగా వ్యక్తులే శక్తిమంతమైన మీడియాగా మారుతున్న ఈ రోజుల్లోనూ మీరు పచ్చి అబద్ధాలను పోగేస్తే నమ్మేస్తారని ఎలా అనుకుంటున్నారు? అసలు ఏనాటికైనా మారుతుందా ‘ఈనాడు’?
‘బీసీ’ల అభ్యున్నతి జనానికి చేరకుండా...
సోమవారం శాసనమండలి అభ్యర్థులను ప్రకటిస్తూ... ఉన్న 18 స్థానాల్లో 14... అంటే ఏకంగా 68 శాతాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయిస్తూ కొత్త చరిత్రను లిఖించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు.
ఆనందంతో ర్యాలీలు చేశారు. ఇప్పటికే బీసీల్లో బలం పెంచుకున్న వై.ఎస్.జగన్‌కు... దీనివల్ల మరింత ఖ్యాతి వస్తుందని భావించిన తెలుగుదేశం, దాని మిత్ర మీడియా... వ్యూహం ప్రకారం అదేరోజున ‘గన్నవరం’ కుట్రకు తెరతీశాయి. తామే రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వటమే కాక... విజయవాడ నుంచి గన్నవరానికి వెళ్లి మరీ పట్టాభి సహా టీడీపీ నేతలు అక్కడి ఎమ్మెల్యే వంశీ అనుచరులతో ఘర్షణకు దిగారు.
దాదాపు అన్ని ఛానెళ్లలోనూ బీసీలకు పట్టం కట్టిన వ్యవహారం రాకుండా... టీడీపీ చక్రం తిప్పింది. మంగళవారం నాడు ‘ఈనాడు’లో ... గన్నవరంలో ప్రభుత్వమే దారుణాలకు పాల్పడ్డట్టుగా... పోలీసులే దౌర్జన్యం చేసినట్లుగా దారుణమైన కథనాలు వండివార్చేశారు.
ఆ ఘర్షణల సందర్భంగా అరెస్టయిన పట్టాభిని పోలీసులు దారుణంగా కొట్టారంటూ బుధవారం దాన్ని కొనసాగించారు. అందుకు రుజువులుగా ఎప్పుడో 2021 ఫిబ్రవరి 3నాటి ఫోటోలను... ఇప్పటివేనంటూ వేసేశారు. అదీ జరిగిన కథ!!. ఔరా రామోజీ??
2021, ఫిబ్రవరి 3 ‘ఈనాడు’ ఏం రాసిందంటే...
‘కర్రలు, రాడ్లతో పట్టాభిపై దాడి’ అని ‘ఈనాడు’ బ్యానర్‌గా ప్రచురించిన వార్త ఇది. టీడీపీ నేత పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ‘ఈనాడు’ హడావుడి చేసింది. విజయవాడలోని తన ఇంటి నుంచి కారులో వచ్చిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని... కారు అద్దాలు పగలగొట్టారని... పట్టాభిని కారు నుంచి బయటకులాగి... ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, తొడపై ఇష్టారాజ్యంగా కొట్టారని వార్త ప్రచురించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పట్టాభి భార్య చందన ఆవేదన వ్యక్తం చేసినట్టు మరో వార్త ఇచ్చింది.
పోలీసులు స్పందించి ఆ దాడిని మెడికో లీగల్ కేసుగా నమోదు చేస్తాం... ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తామంటే పట్టాభి వద్దన్నారని, దాంతో... పోలీసులు బలవంతంగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఇంకో వార్త వేసింది. పట్టాభికి సంఘీభావంగా చంద్రబాబు హుటాహుటిన ఆయన నివాసానికి వచ్చి పరామర్శించటమే కాక... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కూడా వేసింది.
ఇక పట్టాభి శరీరంపై గాయాలు... పట్టాభిపై దాడికి ఉపయోగించిన కర్ర... ధ్వంసమైన పట్టాభి కారు అద్దాలు...పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకువెళుతుండటంతో విలపిస్తున్న పట్టాభి... పట్టాభిపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన తరువాత పోలీసులతో మాట్లాడుతున్న చంద్రబాబు... పట్టాభి శరీరంపై గాయాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అంటూ పెద్దపెద్ద ఫొటోలతో విపరీతమైన హడావుడి చేసి... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందనే భావన కలిగించాలని కుట్ర పన్నింది.
కానీ... ఆ కుట్ర బెడిసికొట్టింది
చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే ఆ దాడి గురించి ఫిర్యాదు చేయడానికి పట్టాభి ఇష్టపడలేదు. ఎవరిపైనయినా అనుమానం ఉందా? అంటే కూడా చెప్పలేదు. పోలీసుల దర్యాప్తునకు సహకరించలేదు. పోలీసులు దర్యాప్తు జరపటానికే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? వాస్తవానికి పట్టాభికి సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, కొందర్ని ఆయన చేసిన మోసాలు అప్పట్లో కథలుకథలుగా వినిపించాయి.
తన వ్యక్తిగత రహస్యాలను బయటపడకుండా బ్లాక్‌మెయిలింగ్ చేసేందుకు పట్టాభే ఆ దాడి డ్రామా ఆడించారని టీడీపీ వర్గాలు లోలోపల వ్యాఖ్యానించాయి కూడా. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆయన దర్యాప్తునకు ఇష్టపడలేదు. దీంతో పట్టాభిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టింది.
అయినా... మనసు మారలేదు
అప్పట్లో చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టినా... ‘ఈనాడు’ మాత్రం మారలేదు. మళ్లీ బుధవారంనాడు పాత స్కీమునే పునరావృత్తం చేసింది. పట్టాభి అరికాళ్లు, తొడలపై దెబ్బలు అంటూ అలనాటి 5 ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించింది. ‘దేశమంతా ఐపీసీ చట్టం.. రాష్ట్రంలో వైసీపీ చట్టం’ అంటూ మరో కథనంతో మొదటి, రెండు పేజీలను నింపేసింది. ‘నా భర్త ప్రాణాలకు ముప్పు’ అంటూ పట్టాభి భార్య చందన వాపోతున్నట్టుగా మరో వార్తను ఏకంగా అయిదు ఫొటోలతో ప్రచురించి 3వ పేజీని నింపేసింది.
‘ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తారా’అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మరో వార్త కూడా వేసింది. అంటే... రెండేళ్ల కిందటి ఘటనతో బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ ఆ స్కీమ్‌ను పునరావృత్తం చేశారు రామోజీరావు గారు. కాకపోతే మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలోనే అందరూ నిజానిజాలు చెబుతూ ‘ఈనాడు’ వలువలు ఊడదీసేశారు. ఇప్పటికైనా రామోజీ మారతారా? పట్టాభిని పోలీసులు కొట్టనే లేదు
– వైద్య పరీక్షల్లో నిర్ధారణ
పట్టాభిని పోలీసులు కొట్టారన్న టీడీపీ ఆరోపణలు అవాస్తవమని స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో పట్టాభికి విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్దారించారు.
వైద్యులు రెండు సార్లు పరీక్షించి మరీ ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. దాంతో తనను కొట్టారంటూ పట్టాభి ఆడిన డ్రామా... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలు... రాష్ట్రంలో ఐపీసీ కాదు వైసీపీ అమలు అవుతోందంటూ ఈనాడు చేసిన దుష్ప్రచారం అంతా పక్కా ముందుస్తు కుట్రేనన్నది స్పష్టమైంది.
సీఐ దళితుడు కాదంటూ టీడీపీ అసత్యవాదన...
– ఆయన దళితుడేనని ధ్రువీకరించిన తహశీల్దార్
పట్టాభి, మరికొందరు టీడీపీ నేతలు దళితవర్గానికి చెందిన గన్నవరం సీఐ కనకరావును కులం పేరుతో దూషిస్తూ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఆయన తలకు తీవ్రగాయం కావడంతో వైద్యులు 8 కుట్లు వేయాల్సి వచ్చింది. దాంతో కనకారావు ఫిర్యాదుపై పట్టాభితోపాటు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా టీడీపీ తమ న్యాయవాది ద్వారా న్యాయస్థానంలో అవాస్తవ వాదనలు వినిపించడం విస్మయం కలిగిస్తోంది. అసలు సీఐ కనకరావు దళితుడే కాదని టీడీపీ న్యాయవాది వాదించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. కానీ సీఐ కనకరావు మాల(ఎస్సీ) సామాజిక వర్గానికి చెందినవారని గన్నవరం తహశీల్దార్ ధ్రువీకరించారు. దాంతో టీడీపీ పన్నాగం మరోసారి విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment