సాక్షి, అమరావతి : అతికినట్లు అబద్ధం చెప్పాలని ఈనాడు రామోజీరావు తెగ తాపత్రయపడతారు. కానీ, ఆ తడబాటులో చెప్పకుండానే ఆయన నిజాలు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే.. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తారాస్థాయిలో ఆయనకున్న అక్కసు, విద్వేషం వెళ్లగక్కడంలో ఆయన ఏం చేస్తున్నారో.. ఏం రాస్తున్నారో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. తాజాగా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అమూల్ సంస్థవల్లే గిట్టుబాటు ధర లభించడంలేదని.. అమూల్ ఉద్దేశ్యపూర్వకంగానే పాల సేకరణ ధరలు తగ్గించేసిందని పెడబొబ్బలు పెడుతూ ఈనాడు ఎప్పటిలాగే సిగ్గూఎగ్గూ గాలికొదిలేసి ‘రోడ్డెక్కిన పాడి రైతులు’ అంటూ చేతికొచ్చింది ఎడాపెడా రాసిపారేసింది.
నిజానికి.. అసలు జగనన్న పాల వెల్లువ (జేపీవీ) పథకం ఆ మండలంలో ఇంకా శ్రీకారం చుట్టనేలేదు. అలాంటప్పుడు అమూల్ పాల సేకరణ ధరలు ఎలా ఇస్తుంది? ఈ మండలంలో జేపీవీ ఇంకా ప్రారంభం కాలేదంటే అమూల్ ఇంకా అక్కడకు వెళ్లలేదనే కదా అర్థం. మరి అమూల్ నుంచి గిట్టుబాటు ధర ఎలా లభిస్తుంది? ఇంత చిన్న లాజిక్‌ను రామోజీ ఎలా మిస్సయ్యారు? ఇక ఇదే జిల్లాలో ఇప్పటికే కొన్ని మండలాల్లో అమలవుతున్న జేపీవీతో పాడి రైతులు ఎంతో లబ్ధిపొందుతున్నారు.
ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, జమ్మలమడుగులో పాడి రైతులు పాలు నేలపాలు చేశారంటే అక్కడున్న ప్రైవేట్ డెయిరీలు లేదా ప్రైవేట్ వ్యాపారులు సరైన ధరలు ఇవ్వడంలేదనే కదా అర్థం. పాడి రైతుల నిరసనతో అక్కడ అమూల్ అవసరం ఎంతుందో దీనిబట్టి తెలీడంలేదా రామోజీ.. అబద్ధం చెప్పాలన్న ఆతృతలో నిజం కక్కేసి మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు కదా.. అలాగే, ఈ ఉదంతంతో అక్కడ అమూల్ అవసరం ఎంతుందో స్పష్టం చేస్తోంది కదా..!
అసలు విషయం ఏమిటంటే..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతమంది పాడి రైతులు తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ తమ వెంట తెచ్చుకున్న పాలతో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి మరికొంత నేలపాలు చేసి నిరసన తెలిపారు. ఈ మండలంలో పాల వ్యాపారులతోపాటు ప్రైవేటు డెయిరీలు పాడి రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. మొన్నటి వరకు లీటర్ రూ.80 వరకు చెల్లించేవారు.
పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ఇప్పుడు వీరు పాల సేకరణ ధరను రూ.55కు మించి ఇవ్వడంలేదు. దీంతో తమకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ వారంతా నిరసన వ్యక్తంచేశారు. కానీ, ఇందులోని నిజానిజాలు ఏమీ తెలుసుకోకుండా.. ఒకవేళ తెలిసినా తెలీనట్లు నటిస్తూ జగనన్న పాల వెల్లువ పథకం కింద పాలు సేకరిస్తున్న అమూల్ సంస్థవల్లే గిట్టుబాటు ధర లభించడంలేదని.. అమూల్ కావాలనే పాల సేకరణ ధరలు తగ్గించేసిందని ఈనాడు నిస్సిగ్గుగా ఆరోపించింది.
విజయవంతంగా అమలవుతుంటే..
నిజానికి.. డిసెంబర్ 2020లో జగనన్న పాలవెల్లువ (జేపీవీ) పథకాన్ని ప్రారంభించిన జిల్లాల్లో వైఎస్సార్ జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో చక్రాయపేట, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లోని 100 గ్రామాల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పెండ్లిపర్రి, వీరపునాయనపల్లి మండలాలకు విస్తరించారు. ప్రారంభంలో 1,483 మహిళా పాడి రైతుల నుంచి రోజుకు 4,066 లీటర్ల పాలు సేకరించే వారు.
ప్రస్తుతం ఈ తొమ్మిది మండలాల పరిధిలో 162 గ్రామాల్లో పాలుపోసేవారి సంఖ్య 4,416 మందికి చేరగా, రోజుకు 23,964 లీటర్లు పాలు సేకరిస్తున్నారు. ఇక పాల సేకరణ ధరలను అమూల్ సంస్థ మూడేళ్లలో ఏడుసార్లు పెంచింది. గేదె పాలకు లీటర్‌కు రూ.71.47 నుంచి రూ.89.76కు, ఆవు పాలకు లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు చొప్పున పెంచారు. గేదె పాలపై లీటర్‌కు రూ.18.29, ఆవుపాలపై లీటర్‌కు రూ. 9.49 చొప్పున పెంచారు.
పైగా ఈ జిల్లాలో ఇప్పటివరకు 471.30 టన్నుల పశువుల దాణాను 2,100 మంది మహిళా పాడి రైతులకు పంపిణీ చేశారు. ఏడాదిలో 180 రోజులపాటు పాలుపోసిన రైతులకు రాయల్టీ ఇన్సెంటివ్ రూపంలో రూ.4.93 కోట్లు చెల్లించారు. ఇదే జిల్లాలోని 20 మండలాల్లో మరో 270 గ్రామాల్లో విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
విచ్చలవిడిగా ప్రైవేట్ డెయిరీల దోపిడీ..
అమూల్ పనితీరు ఇలా ఉంటే.. సాధారణంగా ప్రైవేటు డెయిరీలు, పాల వ్యాపారులు మాత్రం పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల సేకరణ ధరలు తగ్గించడం.. ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు పెంచడం వంటి జిమ్మిక్కులు చేస్తూ పాడి రైతులను దోచుకుంటుంటారు. కానీ, అమూల్ మాత్రం ఎప్పుడైనా ఒకే విధంగా ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్ శాతా నికి అనుగుణంగా ధరలు నిర్ణయిస్తూ అణా పైసల తో సహా పాలుపోసిన 10 రోజుల్లో వారి ఖాతాల్లో జమచేస్తోంది. ఈ నేపథ్యంలో.. జమ్మలమడుగు రాజుపాలెం, పెద్దముడియం మండలాల్లో జేపీవీ ప్రాజెక్టును విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధంచేశారు.
వాస్తవానికి జమ్మలమడుగు మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ జేపీవీ ప్రారంభించలేదు, అమూల్ పాలసేకరణ జరగడంలేదు. కానీ, ఈ వాస్తవాలేమీ తెలుసుకోకుండా గిట్టుబాటు ధర కల్పనలో విఫలమైన ప్రైవేటు డెయిరీలను ఎండగట్టడం మానేసి, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి, సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే అమూల్ సంస్థ గిట్టుబాటు ధర ఇవ్వడంలేదంటూ ఈనాడు పెడబొబ్బలు పెట్టింది. ప్రభుత్వంపై రామోజీకి అక్కసు, ఆక్రోశం ఏ స్థాయిలో ఉందో మరోసారి తేటతెల్లమైంది.
Comments
Please login to add a commentAdd a comment