సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని ఈనాడు రామోజీరావు సహించలేకపోతున్నారు. ప్రజలు అభివృద్ధి చెందితే చంద్రబాబు మొహం కూడా చూడరన్నది ఆయన భయం. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై ఆయన అక్కసు కట్టలు తెంచుకుంది. దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు నీరందించి పచ్చటి పైర్లతో కళకళలాడేలా చేస్తుంటే అసత్య కథనాలతో ప్రజలను.. ముఖ్యంగా రైతులను మభ్య పెట్టేలా అసత్య కథనాలు అచ్చేస్తున్నారు.
గత 55 నెలలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్సార్బీసీల ద్వారా మళ్లిస్తూ దుర్భిక్ష రాయలసీమను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సస్యశ్యామలం చేస్తున్నారు. దీంతో రాయలసీమ రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు.
ఇదే రామోజీ కడుపు మంటకు కారణం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పిదాలు, మోసాలు, దోపిడీని కప్పిపుచ్చుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లుతూ పచ్చి అబద్ధాలతో ‘ఈనాడు’లో టన్నులకొద్దీ కథనాలను అచ్చేసి, వికృతానందం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఎన్నాళ్లీ.. ఆయకట్టుకథలు’ శీర్షికన మంగళవారం ఓ కట్టుకథ వండి వార్చారు. ఆ కథనంలో ప్రతి అక్షరంలో సీఎం వైఎస్ జగన్‌పై రామోజీరావు అక్కసు తప్ప.. వీసమెత్తు నిజం లేదు.
కళ్లుండీ చూడలేకపోతే ఎలా?
► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని దక్కించుకున్న బాబు.. ఓట్ల కోసం 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు వామికొండ వద్ద, 1999 ఎన్నికలకు ముందు గండికోట వద్ద మరోసారి గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. కానీ.. ఆ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టికూడా ఎత్తలేదు.
► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1,55,00 ఎకరాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 5 లక్షల మందికి తాగు నీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో చాలావరకు పనులు పూర్తి చేశారు.
► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని ఇష్టానుసారం భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నాలుగైదు టీఎంసీలు తరలించి, ఆయనే పూర్తి చేసినట్లు బీరాలు పలికారు.
► వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2020–21 నుంచి ఏటా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేస్తూ.. ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అవుకు వద్ద రెండో సొరంగాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసి, ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలిస్తున్నారు. సర్వారాయ సాగర్, పైడిపాలెం, వామికొండ సాగర్‌లలో మిగిలిన పనులు, 35 వేల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.130 కోట్లతో చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
► వాతావరణ మార్పుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద వచ్చిన రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవేవీ రామోజీకి కన్పించలేదు.
హంద్రీ–నీవాతో సీమ సస్యశ్యామలం
► గాలేరు– నగరి ప్రాజెక్టు మాదిరిగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉరవకొండ వద్ద ఓసారి, 1999 ఎన్నికలకు ముందు ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఆ తొమ్మిదేళ్లలో ఒక్క అడుగు పని కూడా చేయకుండా రైతులను మోసం చేశారు.
► వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఆయన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్ హౌస్ నిర్మించిన వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా హంద్రీ–నీవాకు నీటిని తరలించేలా 2007 ఆగస్టు 31న ముచ్చుమర్రి ఎత్తిపోతల చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు.
► 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపైనా 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22 (ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. చివరకు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేలా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేదు.
► వైఎస్ జగన్ సీఎం అయ్యాక శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు.
► హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.
► హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో మిగిలిన పనులను పూర్తి చేసి, ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించేలా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు.
► 2019–20లో 41.93 టీఎంసీలు, 2020–21లో 40.98, 2021–22లో 41.23, 2022–23లో 33.85 టీఎంసీలు (కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురవడంతో నీటిని తరలించాల్సిన అవసరం లేకుండా పోయింది), వర్షాభావ పరిస్థితుల్లోనూ 2023–24లో 15 టీఎంసీలు తరలించడం ద్వారా సాగు, తాగునీరు అందించారు.
► సీమను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకూ రెండేసి మార్లు శంకుస్థాపన చేసి, చేతులు దులుపుకొన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టాక, అప్పటివరకు పనులు చేసిన కాంట్రాక్టర్లను అక్రమంగా తొలగించి, వ్యయాన్ని భారీగా పెంచేసి, నచ్చిన కాంట్రాక్టర్లతో పనులు చేయించి, కమీషన్లు దండుకొన్న విషయం రామోజీకి తెలియంది కాదు. అయినా చంద్రబాబు అక్రమాలపై ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడు సీఎం జగన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, సీమ రైతులకు సాగునీటిని, ప్రజలకు తాగునీటిని అందిస్తుంటే మాత్రం కడుపు మంట రాతలు రాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment