గతనెల 30న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రు పల్లిపాలెంలో వరద బాధితులకు భోజన వసతి
రోజుకో తప్పుడు కథనం.. అంశం ఏదైనా సరే దురుద్దేశం.. వెరసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం.. ప్రజల్లో విష బీజాలు నింపడమే లక్ష్యం.. చంద్రబాబుకు అనుకూల పరిస్థితి సృష్టించాలన్న తాపత్రయం.. ఇదీ ఈనాడు రామోజీరావు ఆకాంక్ష. ప్రజలేమను కుంటారోనన్న కనీస స్పృహను ఏనాడో వదిలేసిన ఈయన ప్రతిపక్ష నేతపై ఆశలు పెంచుకుని నెట్టుకొస్తూ సరికొత్త పాత్రికేయానికి తెరలేపారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అయితే, వాటిని ప్రచారం చేయడంలో ఆయన తాత రామోజీ! ఈయన గారి ఆకాంక్ష గాలిలో దీపంలా మిణుకుమిణుకు మంటోందన్నది మాత్రం నిజం. త్వరలో అది ఆరిపోతుందనేది ఇంకా పచ్చి నిజం.
సాక్షి, అమరావతి: పచ్చ కామెర్లు సోకిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెత ఈనాడు రామోజీరావుకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. విపత్తుల నిర్వహణలో మన రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా ఉందనే పచ్చి నిజాన్ని కావాలని విస్మరించి, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ గాలిలో దీపమేనంటూ దుష్ప్రచారానికి దిగడం దుర్మార్గం. బరితెగించి మరీ అబద్ధపు కథనం రాసి తన స్థాయిని మరింత దిగజార్చుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న ఈర్ష, ద్వేషాన్ని వెళ్లగక్కారు.
మన విపత్తుల నిర్వహణ విధానం బాగుందని దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాల అధికారులు ఏపీకి వచ్చి అధ్యయనం చేసి వెళ్లారు. జాతీయ విపత్తుల నిర్వహణ విధానం కంటే రాష్ట్ర విపత్తు నిర్వహణ విధానమే బాగుందని సాక్షాత్తూ ఆ సంస్థే పలు సందర్భాల్లో కితాబిచ్చింది. ఈ వాస్తవాలకు మసిపూసి, అసలు విపత్తుల ప్రణాళికే లేదని ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
మూడు రకాల ప్రణాళికలతో సిద్ధం
ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లో పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2021లో స్టేట్ సైక్లోన్ ప్రిపేర్‌డ్‌నెస్ (తుపాను సంసిద్ధత) ప్లాన్, ఫ్లడ్ అట్లాస్ (వరదల కోసం), విపత్తుల సంరక్షణా నియమావళి తయారు చేసింది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్.. జిల్లా, మండల స్థాయిల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను సాంకేతికంగా అభివృద్ధి చేసింది. ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలను వాటికి అనుసంధానించి, ఆ డేటాను విశ్లేషించి.. విపత్తుల సమయంలో వినియోగిస్తున్నారు.
ఏపీ అలెర్ట్ విధానంపై దేశం చూపు
దేశంలోనే మొదటిసారిగా ఏపీ అలెర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేసే మెసేజ్‌లను పంపే విధానాన్ని ఏడాది క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పటి వరకు 8 కోట్ల మెసేజ్‌లను ప్రజలకు పంపారు. తద్వారా తుపానులు, పిడుగులు, వడగాడ్పులు, భారీ వర్షాల సమాచారాన్ని ప్రజలను పంపి అప్రమత్తం చేస్తున్నారు. 5,400 ఆపద మిత్ర వలంటీర్లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చి విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో నియమించారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు సైతం విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం విపత్తులకు గురయ్యే ప్రతి జిల్లాకు రెస్క్యూ బోట్స్, లైట్స్, పవర్ సాస్, లైఫ్ జాకెట్స్ వంటి పరికరాలను పంపారు. ఈ చర్యల ద్వారా గత నాలుగేళ్లలో విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అలెర్ట్ సిస్టం పనితీరును పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు ఏపీకి వచ్చాయి.
ఉత్తరాఖండ్ (17–05–22), ఒడిశా (22–03–22), అస్సాం (18–01–22), తమిళనాడు (23–03–22), తెలంగాణ (19–05–23), ఢిల్లీ–ఎన్‌డీఎంఏ (01–07–22) అధికారుల బృందాలు తాడేపల్లిలోని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను సందర్శించాయి. విపత్తు నిర్వహణలో రాష్ట్రం అత్యుత్తమ విధానాలు అమలు చేస్తుందనే దానికి ఇవే నిదర్శనం.
ప్రాణ, ఆస్తి నష్టం నివారణ
దాదాపు 16 సంవత్సరాల తర్వాత 2022 జూలైలో ధవళేశ్వరం బ్యారేజి వద్ద 22,58,895 క్యూసెక్కుల స్థాయికి వరద ప్రవాహం చేరింది. విపత్తుల ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా అప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగారు. 48 గంటలు ముందుగానే వరద ప్రభావంతో ముంపునకు గురయ్యే గ్రామాలను రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా గుర్తించి ఆ జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని బ్యారేజీల వద్దకు, ప్రాజెక్టుల నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదలైతే ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు.
క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమయ్యాయి. జిల్లాల విభజన వల్ల కలెక్టర్లు, జేసీలు, ఎస్పీల సంఖ్య పెరిగింది. ఫలితంగా విపత్తుల నిర్వహణ సహా అనేక ప్రభుత్వ పాలనా కార్యక్రమాలు వేగంగా, చురుగ్గా జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో విప్లవాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నాయి.
ప్రతి 2 వేల జనాభాకు 10, 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, వీరికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలు అందిస్తున్నారు. విపత్తుల సమయంలో వీరు అందిస్తున్న సేవలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయ, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు తోడుగా నిలవడం, సహాయ శిబిరాల నిర్వహణ వంటి పనుల్ని అత్యంత వేగంగా, మెరుగ్గా చేపడుతున్నారు. గత ఏడాది గోదావరి వరదల సమయంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ గొప్పగా సేవలు అందించింది. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో దోహదపడ్డారు.
గతం కంటే మిన్నగా సాయం
జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాల కన్నా మిన్నగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందనేది జగమెరిగిన సత్యం. విపత్తు సంకేతాలు వచ్చిన వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు ఇవ్వక కలెక్టర్లు, అధికారులు నానా యాతన పడేవారు. చివరకు సహాయ కార్యక్రమాలు చేపట్టలేక బాధితులు కన్నీటి పర్యంతమయ్యేవారు. ఈ ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చేసింది. తాజా గోదావరి వరదల్లో కూడా రూ.31.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది.
కేంద్ర మార్గదర్శకాల్లో లేకపోయినా ఇళ్లలోకి నీళ్లు చేరితే చాలు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందిస్తోంది. గతంలో ఈ నగదు సహాయం ఇచ్చే వారు కాదు. వీటితోపాటు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలను నేరుగా బాధితుల ఇళ్లకు అందించేలా చర్యలు తీసుకుంది. కచ్చా ఇళ్లు దెబ్బతింటే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన సహాయం రూ.5 వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తోంది. పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తోంది. గత ప్రభుత్వంలో ఇలాంటి సహాయ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదన్న విషయం మీకు తెలియదా రామోజీ?
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
► టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 సంవత్సరాల్లో హుదుద్, తిత్లి తుపానులతో సహా విపత్తుల సహాయ చర్యల కోసం విడుదల చేసిన మొత్తం నిధులు రూ.2014 కోట్లు మాత్రమే. 2019–23 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయక చర్యల కోసం రూ.2422 కోట్లు విడుదల చేసింది.
► టీడీపీ హయాంలో రెస్క్యూ కార్యకలాపాల కోసం అసలు బడ్జెట్ విడుదల చేయనేలేదు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇందుకు రూ.1969.83 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు తన పాలనలో విపత్తులప్పుడు సహాయ శిబిరాల్లో ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం గురించి పట్టించుకోలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబానికి రూ.2 వేల వరకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
► బియ్యం, నూనె, ఉల్లి, కిరోసిన్ మొదలైన నిత్యావసర సరుకులు 2014–19 మధ్య హుద్ హుద్, తిత్లీ తుపాను సమయంలో మాత్రమే ఇచ్చారు. ఈ ప్రభుత్వం 2020, 2021, 2023 సంవత్సరాల్లో రాష్ట్రం ఎదుర్కొన్న అన్ని విపత్తుల్లోనూ నిత్యావసర సరుకులు అందించింది.
► చంద్రబాబు హయాంలో ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో చెల్లించలేదు. 2019 నుంచి ప్రస్తుత ప్రభుత్వం వెనువెంటనే చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment