
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోళ్లలో రాష్ట్ర ఇంధన శాఖ మరో రికార్డు నమోదు చేసింది. 2021–22 తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రూ. 95 కోట్ల మేర ఆదా చేసింది. అంటే రోజుకు రూ.కోటి వరకు ఇంధన కొనుగోళ్లలో ఆదా అయింది. ఇక గత రెండేళ్లలో కూడా విద్యుత్ కొనుగోళ్లలో ఇప్పటికే రూ.2,342.45 కోట్లు మిగిల్చింది. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం తగ్గనుంది. అంతిమంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించనుంది. గత ప్రభుత్వం ఈ తరహా నియంత్రణ చర్యలను పాటించకపోవడంతో ప్రజలు ఏటా విద్యుత్ చార్జీల భారం మోయాల్సి వచ్చింది. నిర్వహణ వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకుని ప్రజలపై విద్యుత్ భారాన్ని నివారించే చర్యలపై ఇటీవల విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులు చర్చించారు. ట్రాన్స్‌కో జేఎండీ వెంకటేశ్వరరావు, డిస్కమ్‌ల సీఎండీలు పద్మా జనార్థన్‌రెడ్డి, హరినాథ్‌రావు, సంతోష్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, ముత్తుపాణ్యన్ పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా..
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. నిర్వహణ వ్యయంలో 80 శాతం విద్యుత్ కొనుగోలు ఖర్చే ఉంటుంది. మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చౌకగా లభించే సమయంలో ఎక్కువగా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో రియల్ టైం విధానం వల్ల ప్రతి 15 నిమిషాలకు విద్యుత్ ధరలను అంచనా వేసే వీలుంది. ఈ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించేందుకు సాంకేతికతను బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. దీని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ పర్యవేక్షించనుంది.
కేంద్రం ప్రశంసలు..
రియల్ టైం మార్కెట్ ద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఇతర రాష్ట్రాలకన్నా ఏపీ మెరుగ్గా నియంత్రించడాన్ని కేంద్ర సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్‌శర్మ అభినందించిన విషయం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇదే ఒరవడితో ముందుకెళ్లాలని కమిటీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment