సాక్షి, హిందూపురం: అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడు రఘును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హిందూపురం రూరల్ సీఐ హమీద్ ఖాన్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు.
ఈ నెల 17న పరిగి మండలం పైడేటీ గ్రామంలో అన్న మారుతీపై తమ్ముడు కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చిన విషయం విదితమే. ఘటన అనంతరం తమ్ముడు రఘు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ధనాపురం క్రాస్ వద్ద నిందితుడు రఘును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అన్నదమ్ములిద్దరికీ తాగుడు అలవాటు ఉంది. మద్యం మత్తులో తమ్ముడు రఘును మారుతి ఇష్టానుసారంగా తిట్టేవాడు. దీంతో అన్నపై కక్ష పెంచుకున్న రఘు అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల 17న రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద రఘుతో మారుతి గొడవ పడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రఘు ఇంటి లోపలకు వెళ్లి కిరోసిన్ తీసుకువచ్చి అన్నపై పోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మారుతిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 18న అతను మృతి చెందాడు. మారుతి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment