‘స్మార్ట్‌’గా విద్యుత్‌ | Electricity smart meters are coming soon in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’గా విద్యుత్‌

Published Thu, Nov 18 2021 5:06 AM | Last Updated on Thu, Nov 18 2021 9:38 AM

Electricity smart meters are coming soon in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రానున్నాయి. వీటి ద్వారా నాణ్యమైన, సరఫరాలో లోపాలు లేని విద్యుత్‌ను పొందవచ్చు. మొబైల్‌ ఫోన్ల లాగానే ముందుగా రీచార్జ్‌ చేసుకొని మనకు ఎంతమేరకు విద్యుత్‌ అవసరమో అంతే పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు, డిస్కంలకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ మీటర్లు అమరుస్తున్నారు. 2025 నాటికి స్మార్ట్‌ మీటర్లు వినియోగంలోకి తేవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. మూడు, నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాల్లో 250 మిలియన్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అవే సంస్కరణలను రైతులు, డిస్కంల శ్రేయస్సు కోసం వినియోగిస్తోంది. 

ప్రభుత్వ సర్వీసులకు టెండర్లు పిలిచిన ఏపీ డిస్కంలు 
కేంద్రం రూపొందించిన నమూనా పత్రం ఆధారంగా రాష్ట్రంలోనూ టెండర్లు పిలిచారు. ముందుగా ప్రభుత్వ రంగ విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలో లక్ష సర్వీసులు చొప్పున, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో 1.30 లక్షల సర్వీసులకు టెండర్లు పిలిచారు. డిసెంబర్‌ 1 నుంచి మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు డిస్కంల సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించారు. 

వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు 
వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికోసం 7 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐ) నుంచి తీసుకోనుంది. ఉచిత విద్యుత్‌ లక్ష్య సాధనకు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులపై భారం పడకుండా ఈ మీటర్ల వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. నాణ్యమైన విద్యుత్‌ నిరంతరాయంగా అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో రైతుల సమ్మతితో వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని మీటర్లు బిగిస్తున్నారు.  రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,200కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వమే మీటర్లు ఏర్పాటు చేస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

ఎప్పటికప్పుడు మొబైల్‌కు సమాచారం 
స్మార్ట్‌ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్‌’ ద్వారా వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్‌ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్‌  ఫోన్లకు పంపుతాయి. వినియోగదారులు రీచార్జ్‌ వంటి సేవలను, ఫిర్యాదులను వారి మొబైల్‌ ద్వారానే పొందవచ్చు. ఎంత విద్యుత్‌ అవసరమనుకుంటే అంతే రీచార్జ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వ, వ్యవసాయ సర్వీసులకే స్మార్ట్‌ మీటర్లు అమర్చనున్నందున ప్రభుత్వమే రీచార్జ్‌ ప్రక్రియను ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్వహించే అవకాశం ఉంది.

ఎన్నో ప్రయోజనాలు 
► స్మార్ట్‌ మీటర్లతో  మొబైల్‌ రీచార్జ్‌ మాదిరిగానే ముందుగా విద్యుత్‌ మీటర్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల పంపిణీ సంస్థలకు ముందుగానే నగదు జమ అవుతుంది. బకాయిల భారం ఉండదు. 
► అవసరం మేరకే విద్యుత్‌ వినియోగించొచ్చు. వృధా ఉండదు 
► సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు లభిస్తుంది 
► పంపిణీ వ్యవస్థలో లోపాలను, లో ఓల్టేజిని త్వరగా గుర్తించి, విద్యుత్‌ అంతరాయాలను వెంటనే పరిష్కరించొచ్చు 
► గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడును కచ్చితంగా లెక్కించవచ్చు. లోడు ఎక్కువ ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్ల సామర్ధ్యం పెంచొచ్చు 
► రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఉన్నవారికి ఆదాయ వనరుగా మారడానికి టూ–వే ఫ్లో డిటెక్షన్‌తో నెట్‌ మీటరింగ్‌ను కూడా అందిస్తుంది 
► సబ్సిడీ విద్యుత్‌ పొందే ప్రజల సర్వీసులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేయడం వల్ల సబ్సిడీ సొమ్ము వారి ఖాతాలకు జమ అవుతుంది 
► గ్రిడ్‌ను స్థిరీకరించడానికి స్మార్ట్‌ మీటర్లు సహాయపడతాయి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement