కంటైనర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ | Electricity substation in container At Vijayawada | Sakshi
Sakshi News home page

కంటైనర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

Published Mon, Feb 27 2023 4:26 AM | Last Updated on Mon, Feb 27 2023 4:26 AM

Electricity substation in container At Vijayawada - Sakshi

కంటైనర్‌ లోపల ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఆపరేటింగ్‌ సిస్టం

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించాలంటే దాదాపు 20 సెంట్ల స్థలం అవసరం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో.. సబ్‌స్టేషన్‌ కాస్తా ఓ కంటైనర్‌లోనే ఇమిడిపోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. సబ్‌ స్టేషన్లు నిర్మించాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కంటైనర్‌ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. స్థల భారం తప్పడంతోపాటు అనేక లాభాలుంటాయని విద్యుత్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడలోని గొల్లపూడి వద్ద తొలి కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాధారణంగా నౌకల్లో సరుకుల్ని తరలించేందుకు కంటైనర్లను వినియో­గిస్తుంటారు. ఇటీవల కాలంలో కంటైనర్‌ ఇళ్లు సైతం నిర్మిస్తు­న్నారు. తాజాగా కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్‌) కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించింది. విజయవాడ సమీపం­లోని గొల్లపూడి శ్రీని­వాస నగర్‌లో రూ.5.50 కోట్లు వెచ్చిం­చింది.

ఇప్ప­టికే ట్రయల్‌ రన్‌ విజయవంతం కాగా.. మార్చిలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పా­ట్లు చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవు ఉంది. అందులోనే సబ్‌స్టేషన్‌కు సంబంధించిన పరికరాలన్నీ అమర్చా­రు. అత్యా­ధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్‌ ఆధా­రంగా ఆపరేట్‌ చేసేలా దీనిని నిర్మించారు. పూర్తి ఆటోమేషన్‌ విధానంలో ఇది∙పనిచేస్తుంది. తిరుపతి, విశాఖపట్నంలోనూ ఈ కంటైనర్‌ సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తున్నారు.

ప్రత్యేకతలు ఇవీ..
► సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరం. కంటైనర్‌ సబ్‌స్టేషన్‌కు  2నుంచి 3 సెంట్ల జాగా సరిపోతుంది.
► సాధారణ సబ్‌స్టేషన్‌కు మూడు నెలలకొకసారి నిర్వహణ తప్పనిసరి. కంటైనర్‌కు నిర్వహ­ణ వ్యయం అవసరం లేదు. విద్యుత్‌ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్‌ కంటే మెరుగ్గా ఉంటుంది. 
► అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాకు వీలుంటుంది. బ్రేక్‌ డౌన్స్‌ ఉండవు.  ఓఎన్‌ఎం సిబ్బందికి పూర్తి రక్షణ ఉంటుంది. 
► రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్‌ ప్రాంతాల్లో సైతం వీటిని నిర్మించవచ్చు. అక్కడ అవసరం లేకపోతే మరో ప్రాంతానికి తరలించవచ్చు.
► వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిచోట శివారు ప్రాంతాల నుంచి కూడా కంప్యూటర్‌ ద్వారా ఆపరేట్‌ చేయవచ్చు.

సమస్య తలెత్తితే..
సబ్‌స్టేసన్‌లో సమస్య తతెత్తితే సెన్సార్ల ద్వారా ఆ­టోమేటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడి­యో కాల్‌ ద్వారా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి పరి­ష్క­రించే వెసులుబాటు ఉంది. లోపల ఏం జ­రు­గుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కె­మె­రాలు ఏర్పాటు చేశారు. సబ్‌స్టేషన్ల పరిధిలో వి­ద్యు­త్‌ లైన్లు తెగిన వెంటనే ట్రిప్‌ అయి సరఫరా నిలి­చి­పోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలోనైనా సమస్య తలె­త్తితే సబ్‌స్టేసన్‌లోనే ఉండి తెలుసుకునే వీలుంది.

ఎంతో ప్రయోజనం
కంటైనర్‌ సబ్‌స్టేషన్ల వల్ల ఎన్నో ప్రయోజనా­లున్నా­యి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించాం. వీటివల్ల డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుంది. జనావాసాల్లో స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్‌ సబ్‌స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. 
– జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్‌

గొల్లపూడి ప్రాంతానికి వరం
గొల్లపూడి ప్రాంత ప్రజలకు కంటైనర్‌ సబ్‌ స్టేషన్‌ వరం లాంటిది. ఈ ప్రాంతం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. నూతన గృహ, వాణిజ్య సముదాయాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్‌లో వాటికి నిరంతర విద్యుత్‌ సరఫరా అందుబాటులోకి తీసుకు రావడానికి కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు. విద్యుత్‌ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, ఉమ్మడి కృష్ణా జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement