ఏలూరు జిల్లాలో 63 మంది కార్యదర్శులకు పదోన్నతి
తన నియోజకవర్గంలో పదోన్నతి పొందిన వారే లక్ష్యం
ఆరుగురు కార్యదర్శులను రిలీవ్ చేయకూడదంటూ హుకుం
ఆయన ఆదేశాలకు జీహుజూర్ అన్న ఉన్నతాధికారులు
ఎమ్మెల్యే వేధింపులతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికారులు, ఉద్యోగులపై టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులకు ఇదో మచ్చుతునక. ఏలూరు జిల్లావ్యాప్తంగా 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రాగా 57 మంది కొత్త స్థానాల్లో చేరారు. తన నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఆరుగురి పదోన్నతికి మాత్రం చింతమనేని మోకాలడ్డు పెడుతున్నారు. ఆ ఆరుగురిని టార్గెట్ చేసి వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
మరో 3 రోజులు జాప్యం జరిగితే వచ్చిన పదోన్నతులు దక్కకపోగా స్థానికంగా తీవ్ర అవమానాలు, భౌతిక దాడులు భరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలూరు జిల్లాలో ఈనెల 8న 63 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 పదోన్నతి దక్కింది. పదోన్నతి ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పదోన్నతుల వ్యవహారం సజావుగా సాగింది. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
ఇక్కడ 12 మందికి పదోన్నతి దక్కితే ఆరుగురు నానా తంటాలు పడి గత వారంలో రిలీవ్ అయి కొత్త స్థానంలో విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురిని మాత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, స్థానిక నేతలతో సన్నిహితంగా ఉన్నారని, ఇలా రకరకాల ముద్రలు వేసి ఆ ఆరుగురు పదోన్నతులు అడ్డుకున్నారు. తనకు చెప్పకుండా వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదని జిల్లా పంచాయతీ అధికారికి ఆయన ఆదేశించారు. దీంతో ఆ ఆరుగురి భవితవ్యం గాలిలో ఉంది.
రెడ్‌బుక్ రాజకీయాలు
దెందులూరు మండలంలో రామారావుగూడె, పెదవేగి మండలంలోని విజయరాయి, నడిపల్లి, భోగాపురం, జగన్నాథపురం, ఏలూరు రూరల్ మండలంలో మల్కాపురం పంచాయతీ కార్యదర్శులను వేధిస్తూ ఎమ్మెల్యే రెడ్‌బుక్ రాజకీయాలకు తెరతీశారు. కక్ష సాధింపులతో నిరంతరం అవమానాలకు గురిచేయడంతో పాటు మాటలతోనూ వేధిస్తున్నారు. వీరిలో ఒక పంచాయతీ కార్యదర్శిపై కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో 40 నిమిషాల పాటు బహిరంగ వేదికపైనే తీవ్రస్థాయిలో చింతమనేని విరుచుకుపడ్డారు.
ప్రొటోకాల్ పాటించలేదనే కారణంతో సదరు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీపీఓను ఆదేశించడంతో డీపీఓ ఆగమేఘాలపై సస్పెన్షన్‌కు ఫైల్ రెడీ చేశారు. మరో పంచాయతీ కార్యదర్శి రిలీవ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆ కార్యదర్శిని మందలించి మరీ పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment