ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: చాలా దేశాల్లో వృద్ధులు ఎక్కువై పనిచేసే యువత తక్కువగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువ జనాభానే అధికం. ఇలా వర్క్‌ఫోర్స్ (పనిచేసే సైన్యం) అయిన యువత ఏపీలో అధికంగా ఉండడం శుభ పరిణామమని నిపుణులు అంటున్నారు. సీఆర్‌ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సర్వే) తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో 20 నుంచి 44 ఏళ్లలోపు యువత అధికంగా ఉంది. దీనివల్ల సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తిపై ఎక్కువ సానుకూల ప్రభావం ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ఉత్పాదకతపై ఎక్కువ ప్రభావం చూపే 20–44 ఏళ్లలోపు యువత మన రాష్ట్రంలో 2,12,92,205 మంది ఉన్నారు.
తాజా సర్వే ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు అయితే.. ఏపీ జనాభా 5.23 కోట్లు. ఇందులో 40.7 శాతం మంది 20–44 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. అదే జాతీయ సగటు 37.9 శాతం మాత్రమే. అంటే దేశంలో 50.74 కోట్ల మంది యువత ఉన్నట్లు లెక్క.
అలాగే, ఆర్సీహెచ్ (రీ ప్రొడక్షన్ చైల్డ్–పునరుత్పత్తి సామర్థ్యం) అంటే పిల్లలను కనే అవకాశం ఉన్న మహిళల సంఖ్య (20 నుంచి 35 ఏళ్ల లోపు వారు) కూడా భారతదేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మరోవైపు.. రాష్ట్రంలో పదేళ్లలోపు చిన్నారులు 83.70 లక్షల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 16 శాతం మంది అన్నమాట. ఇక రాష్ట్రంలో 60 ఏళ్లు ఆ పైన ఉన్న వారు 10.8 శాతంగా (56.50 లక్షల మంది) నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment