![Fact Check: After The Repairs 108 Ambulances Run On Track - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/19/566_1.jpg.webp?itok=tsGYeY-I)
సాక్షి, అమరావతి: గతంతో పోలిస్తే 108 అంబులెన్స్‌ల సేవలు ఎంతో బాగున్నట్లు చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఈనాడుకు మాత్రం 108లు ఆపదలో ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డొక్కు వాహనాలతో 108 సేవలు మొరాయించినా రామోజీకి అంతా సవ్యంగానే కనిపించింది. నాడు అంబులెన్స్‌లు రాక ప్రాణాలు గాల్లో కలిసినా ఆ పెద్ద మనిషికి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం 60 వేల జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలి. దేశవ్యాప్తంగా సగటున లక్షకు పైగా జనాభాకు ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 74 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 అంబులెన్స్‌లు ఉన్నాయి.
16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు..
సెల్ఫ్ మోటర్, వైరింగ్ సమస్యతో ఓ అంబులెన్స్ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆగిపోవడంతో మెకానిక్ షెడ్డుకు తరలిస్తున్న ఫోటోను ఈనాడు కథనంలో ప్రచురించింది. నంబులపూలకుంట మండలానికి చెందిన ఈ వాహనం ఈ నెల 13వతేదీన 01 : 23 గంటలకు నిలిచిపోయింది. అంబులెన్స్ నిలిచిపోవడానికి ముందు వరకు కూడా 3 కేసుల్లో సేవలు అందించింది. మరమ్మతుల అనంతరం మరుసటి రోజు 4 : 52 గంటల నుంచి అంబులెన్స్ తిరిగి విధుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్క రోజు మాత్రమే నిలిచిపోయింది. మిగిలిన 16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు అందించింది.
కొత్త వాహనాల కొనుగోలు
2020 జూలై ఒకటో తేదీ నుంచి 768 వాహనాలతో సీఎం జగన్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను బలోపేతం చేసింది. 432 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. 336 వాహనాలకు మరమ్మతులు నిర్వహించి సేవలు అందిస్తోంది. నంబులపూలకుంట అంబులెన్స్ చాలా పాత వాహనం. 2.5 లక్షల కి.మీ పైగా తిరిగిన వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంలో భాగంగా 146 అంబులెన్స్‌ల కొనుగోలుకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. వీటి కొనుగోలుకు ప్రభుత్వం రూ.41 కోట్ల మేర ఖర్చు చేయనుంది.
నిబంధనలకు లోబడే స్పందన
నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవాలన్నది నిబంధన. అయితే 14.50 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలకు గాను 16.55 నిమిషాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 22.12 నిమిషాల్లోనే వస్తున్నాయి.
త్వరలోనే ట్రాకింగ్ సదుపాయం..
కాల్ సెంటర్ నుంచి అన్ని అంబులెన్స్‌లను ట్రాక్ చేస్తుంటాం. ఎక్కడైనా వాహనం అందుబాటులో లేకపోయినా, నిలిచిపోయినా వెంటనే తెలిసిపోతుంది. జిల్లాల వారీగా డ్యాష్ బోర్డును కో–ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తుంటారు. మరో 20 రోజుల్లో కాల్ చేసిన వారు తమ మొబైల్ నుంచి అంబులెన్స్ లొకేషన్‌ను ట్రాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అప్లికేషన్ ఇప్పటికే సిద్ధమైంది. అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం తనిఖీ చేయడానికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగించనున్నాం. 15 రోజుల్లో ఈ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది.
– ఎం.ఎన్. హరేందిరప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment