
టీడీపీ హయాంలో
2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 5,171.29 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. ఇందులో రూ. 631.56 కోట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది. అప్పట్లో పథకం పరిధిలో 1,059 ప్రొసీజర్లు, 748 నెట్‌వర్క్ ఆస్పత్రులు మాత్రమే ఉండేవి. రోజుకు సగటున 1,570 మంది మాత్రమే చికిత్స పొందేవారు.
– సాక్షి, అమరావతి
వైఎస్ జగన్ ప్రభుత్వంలో
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2019 నుంచి ఈ ఏడాది జూలై వరకూ రూ.8,816.57 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 44.21 లక్షల మంది రోగులు ఉచితంగా చికిత్సలు చేయించుకున్నారు. రోజుకు సగటన 3,300 మంది చికిత్స పొందుతున్నారు. ప్రొసీజర్లను 3,257కి పెంచారు. 2,282 నెట్‌వర్క్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వీటిలో ఏపీతో పాటు పక్క రాష్ట్రాల ఆస్పత్రులు కూడా ఉన్నాయి.
మరోవైపు శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంత భృతిగా ఆరోగ్య ఆసరా కింద రూ.1,449.49 కోట్లు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సాయం అందించింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికీ పథకాన్ని వర్తింపజేసి మధ్య తరగతి కుటుంబాలకు భారీ ఊరట కల్పించింది. ఇది కాక రూ.350 కోట్లతో 108 అంబులెన్స్‌లు 768 వాహనాలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్‌లు 910 వాహనాలను ప్రవేశపెట్టింది.
ఈ వివరాలను పరిశీలిస్తే కాస్తంత ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ఆరోగ్యశ్రీ పథకం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నట్టు అర్థమవుతంది.. ఒక్క రామోజీరావుకు తప్ప. అందుకే.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై విషం చిమ్ముతూ ఈనాడు పత్రికలో రోత రాతలు రాసేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే...
ఈనాడు ఆరోపణ: నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగడంలేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక స్పష్టం చేసింది. ట్రస్ట్ నుంచి 60 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా, ఏకంగా 400 రోజుల సమయం పడుతోందని ఆక్షేపించింది. దీంతో ఆస్పత్రుల్లో నిస్తేజం అలముకుంది.
వాస్తవం: నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్‌లను ప్యానెల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిశీలించి చెల్లింపులు చేస్తుంది. కొన్ని ఆస్పత్రులు క్లెయిమ్‌ల నమోదు సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను జత చేయకపోవడంతో వాటిని వెనక్కు పంపుతారు. ఆ పత్రాలు జత చేసి మళ్లీ పంపితే ఆమోదిస్తారు. అనంతరం బిల్లులు చెల్లిస్తారు. అంతే తప్ప బిల్లుల చెల్లింపుల్లో ఏ విధమైన జాప్యం లేదు.
ఆరోపణ: సత్తెనపల్లి, తాడిపత్రి ఏరియా ఆస్పత్రు లకు 2019 మే నుంచి అక్టోబర్ 2021 మధ్య ట్రస్ట్ ఇచ్చిన రూ.43.19 లక్షలను వినియోగించకుండా బ్యాంకుల్లోనే భద్రపరిచారు.
వాస్తవం: రోగులకు వైద్యం చేసిన సిబ్బందికి ట్రస్ట్ అందించాల్సిన ప్రోత్సాహకాలను నేరుగా సంబంధిత సిబ్బంది ఖాతాల్లో జమ చేయటానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈలోగా డబ్బును బ్యాంక్‌లో భద్రంగా ఉంచితే ఈనాడుకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడంలేదు.
ఆరోపణ: ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులకందించిన చికిత్సలపై క్లినికల్, మెడికల్ డెత్ ఆడిట్ లేదు.
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం అమలుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో క్లినికల్, మెడికల్ డెత్ ఆడిట్ కోసం జేఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సక్రమంగా సేవలు అందించని 8 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులను ప్రత్యేక బృందం పరిశీలించి పథకం నుంచి తొలగించింది. అంతేకాకుండా చిన్న చిన్న తప్పులు చేసిన 17 ఆస్పత్రుల నుంచి రూ.1.17 కోట్లు జరిమానాగా వసూలు చేశారు.
ఆరోపణ: 2019 జనవరి నుంచి 2021 మార్చి మధ్య ఆరోగ్యశ్రీ కింద 17,16,317 క్లెయిమ్‌లు వచ్చాయి. ఇందులో 9.24 లక్షల క్లెయిమ్‌లకు ఆలస్యంగా చెల్లింపులు చేశారు.
వాస్తవం: 2019 జనవరి నుంచి 2023 జూలై నెలాఖరుకి ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు మొత్తం 44,21,025 క్లెయిమ్‌లు వచ్చాయి. వీటికి రూ.8,816.57 కోట్లు చెల్లించారు. ఇది వాస్తవం. ఈనాడులో 2021 వరకు డేటాను మాత్రమే పరిశీలించారు. దురుద్దేశపూర్వకంగా వైద్యం చేయించుకున్న వారి సంఖ్యను తక్కువగా చేసి చూపారు.
ఆరోపణ: పథకం కింద ప్రభుత్వ బోధనాస్ప త్రుల్లో 133, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 123 చికిత్సలు ఉన్నాయి. వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నెలకు ఒక్కో ఆస్పత్రి నుంచి 40 కేసులే చూడాలన్న నిబంధన తెచ్చారు. కొన్ని ఆస్పత్రులు మాత్రం 133 రకాల చికిత్సలను రోగులకు అందించాయి. 2020 డిసెంబర్ నుంచి 81 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 133 చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు.
వాస్తవం: గత ప్రభుత్వంలో ప్రభుత్వ బోధనాస్ప త్రుల్లో 133, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 123 చికిత్సలు అనుమతించారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 171, ప్రైవేట్‌లో 108 చికిత్సలకు అనుమతి ఇచ్చారు. గతంలో ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు 40 కేసులే అనే నిబంధన ఉండేది. ఈ ప్రభుత్వం ఆస్పత్రుల అభ్యర్థన మేరకు రోజుకు రెండు కేసుల వరకూ చూసేలా 40 నుంచి 60 కేసులకు అనుమతించింది.
మీ బాబు హయాంలోనే కష్టాల్లో ఆరోగ్యశ్రీ
ఆరోగ్య శ్రీ పథకం కష్టాల్లో పడి కొట్టుమిట్టాడింది రామోజీకి అత్యంత ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. కేవలం 1,059 ప్రొసీజర్లతో అరకొర ఆస్పత్రుల్లో తూతూ మంత్రంగా పథకాన్ని కొనసాగించారు. దీంతో అనారోగ్యం బారిన పడిన పేద కుటుంబాలు అప్పట్లో వైద్యం కోసం అనేక అగచాట్లు పడ్డాయి. అప్పట్లో సీఎం తమ వాడు కావడంతో రామోజీరావుకు పేదవాడి అరణ్య రోదన ఏమాత్రం పట్టలేదు.
బాబు ఘనకార్యాలతో నిర్వీర్యమైపోయిన ఆరోగ్య శ్రీ పథకానికి సీఎం జగన్ ఊపిరిలూదారు. నిధులు, ప్రొసీజర్లు, నెట్‌వర్క్ ఆస్పత్రులు పెంచారు. పక్క రాష్ట్రాల్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 108, 104 వాహనాలను పెంచి, సత్వర వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించేలా పథకాన్ని బలోపేతం చేశారు. ఏదైనా జబ్బు చేసినా ఆరోగ్యశ్రీ అండగా ఉందిలే అనే భరోసాను పేద, మధ్యతరగతి కుటుంబాలకు కల్పించారు.
ఇది చూసి ఓర్వలేని రామోజీ నిత్యం పథకంపై నిస్సిగ్గుగా బురద రాతలు రాయడంపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 2019 జనవరి నుంచి మే నెలాఖరు మధ్య టీడీపీ హయాంలో క్లెయిమ్‌ల ఆలస్యానికి కారణమెవరన్నది ఈనాడు కథనంలో ఎందుకు ప్రస్తావించలేదు? చంద్రబాబు పెట్టిన బకాయిలు, అప్పట్లో పథకం నిర్వీర్యం చేసిన తీరును దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేలా రామోజీ కథనం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment