
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.