సాక్షి, అమలాపురం/కొత్తపేట: వైద్యులు.. ఇంజి నీర్లు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారులు.. ప్రైవేట్ ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులు కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేరారు. ఇతర వృత్తి నిపుణులకు ఇస్తున్న మాదిరిగానే ఇకపై కౌలుదారులను కూడా అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ (వ్యవసాయ నిపుణులు)గా గుర్తిస్తూ ఇకపై వీరికి కూడా వ్యక్తిగత రుణాలు అందించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంట భూమి లేకపోయినా.. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ‘అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్’గా గుర్తించి జిల్లా యంత్రాంగం రుణాలు మంజూరుకు శ్రీకారం చుట్టింది.
రెవెన్యూ అధికారుల సిఫార్సులతో..
కౌలు కార్డులు (సీసీఆర్‌సీ) ఉన్నా రుణాలు అందుకోలేక ఇబ్బంది పడుతున్న కౌలుదారుల దుస్థితిని గుర్తించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం రైతుల పేరిట సెంటు భూమి లేకున్నా.. సంబంధిత వీఆర్వో, వీఏవోలు, తహసీల్దార్ సిఫార్సు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) రుణాలు మంజూరు చేసింది.
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో తొలివిడతగా 10 మండలాల్లోని 10 గ్రామాలను ఎంపిక చేసి.. ఆయా గ్రామాల్లో 540 మంది అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్‌కు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 323 మందికి మంగళవారం రుణాలు అందజేశారు. కొత్తపేట మండలం అవిడిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసిన రైతులకు రూ.1,40,58,100 చెక్కు రూపంలో అందజేశారు.
విజయవంతమైతే అన్ని గ్రామాలకు విస్తరణ
కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ.. తొలి దశలో 10 మండలాల్లోను, రెండవ దశలో మిగిలిన 22 మండలాల్లోని 25 గ్రామాల్లోని ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. వ్యక్తిగత రుణాలతోపాటు ఐదు మండలాల పరిధిలో 38 గ్రూపులకు చెందిన 526 మంది రైతులకు సైతం రుణాలు అందించనున్నారు. 6 నెలల్లో ఫలితాలు చూసి జిల్లాలోని అన్ని గ్రామాలకూ విస్తరిస్తామన్నారు. ఇందుకోసం డీసీసీబీతోపాటు యూనియన్ బ్యాంక్ సైతం ముందుకు వచ్చాయని కలెక్టర్ చెప్పారు.
ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీనిని అమలు చేయడం అభినందనీయమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి కౌలు రైతులకు మేలు చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు.
బ్యాంక్ రుణం ఇదే తొలిసారి
నేను 30 ఏళ్లుగా వ్యవ సాయం చేస్తున్నా. నాకు సొంత భూమి లేదు. ఏటా పరిస్థితిని బట్టి 10 నుంచి 20 ఎకరాల వరకు సాగు చేస్తాను. ఎప్పుడూ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయడం తప్ప ప్రభుత్వం నుంచి లేదా బ్యాంకుల నుంచి రుణం పొందలేదు. జగన్ హయాంలో తొలిసారిగా బ్యాంక్ రుణం వచ్చింది. రైతు భరోసా పేరుతో రైతుల అకౌంట్లలో సొమ్ములు వేస్తున్నట్టుగా ఇప్పుడు మా అకౌంట్‌లో రుణం సొమ్ములు వేశారు. చాలా సంతోషంగా ఉంది. – టి.వీరన్న, అవిడి, కొత్తపేట మండలం
వడ్డీకి అప్పు తెచ్చేవాళ్లం
ఇప్పటివరకు వ్యాపారుల వద్ద అప్పులు చేయడం.. నూటికి రూ.3 నుంచి రూ.5 చొప్పున ప్రతినెలా వడ్డీ చెల్లించే వాళ్లం. పైగా ధాన్యం వారు కట్టిన ధరకే అమ్మాల్సి వచ్చేది. సాగు మధ్యలో కాని అప్పులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రూ.1.20 వడ్డీ. సాగుకు ముందే రుణం ఇచ్చారు. తిరిగి చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందుతాం. – డి.పెంటయ్య, అవిడి, కొత్తపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment