క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీస్తున్న దృశ్యం
సంగం: నెల్లూరు–ముంబై రహదారిపై గురువారం రాత్రి లారీ ఢీకొనడంతో వాగులో ఆటో పడిపోయిన ఘటనలో గల్లంతైన ఐదుగురి జాడ శుక్రవారం రాత్రి వరకు తెలియరాలేదు. కుటుంబ సభ్యుడి కర్మకాండలు ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో నెల్లూరు జిల్లా సంగం సమీపంలో గురువారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం విదితమే.
ఈ దుర్ఘటనలో ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగరాజు, భార్య పద్మ, కర్రా పుల్లయ్య, అతని భార్య సంపూర్ణమ్మ, దివానపు ఆదెమ్మ గల్లంతైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఏడుగుర్ని సురక్షితంగా బయటకు తీసినప్పటికీ వారిలో బాలిక నాగవల్లి (14) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. గల్లంతైన వారి కోసం జాయింట్ కలెక్టర్ హరేంద్రప్రసాద్, ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆధ్వర్యంలో బృందాలు బీరాపేరు వాగులో గాలిస్తున్నాయి.
వాగులో ప్రవాహ ఉధృతి శుక్రవారం మరింత పెరగడంతో ఎంత వెతికినా ఒక్కరి జాడ కూడా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ఆటోను వాగులోంచి బయటకు తీశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల సహాయంతో బీరాపేరు వాగంతా జల్లెడ పట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు కృష్ణపట్నం నుంచి మరబోటును తెప్పించి క్రేన్ సహాయంతో కిందకు దింపారు.
Comments
Please login to add a commentAdd a comment