
రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏడాదిలోనే 1.11 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యసేవలు అందాయి. కోవిడ్ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులు పాలుకాకుండా, వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది.
ఇందులో భాగంగా గతేడాది ఏప్రిల్ 7 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 1,11,266 మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.332.41 కోట్లు వ్యయం చేసింది. మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ పథకంలో కోవిడ్ చికిత్సలను చేర్చి ఉచిత వైద్య చికిత్సలను అందించకపోవడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో ఆలోచించి కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్లే గతేడాది కాలంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు నగదు సమస్యను ఎదుర్కోలేదు.