
సాక్షి, హైదరాబాద్/అమరావతి: రాత్రిపూట ఓ గంటపాటు కరెంటు నిలిపేస్తే.. పర్యావరణానికి, భూమికి మేలు జరుగుతుందంటున్నారు పర్యావరణ నిపుణులు. కర్బన ఉద్గారాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపం తగ్గించకుంటే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఏటా మార్చి 26న రాత్రి గంటపాటు విద్యుత్ సహా ఇతర రకాల ఇంధనాల వినియోగం నిలిపేసి భూమికి కొంతైనా ఉపశమనం కలిగించేందుకు ‘ఎర్త్ అవర్’ను ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తెలిపారు. కాలనీలు, రెసిడెన్షియల్ అసోసియేషన్ల సహకారంతో ఎర్త్ అవర్’పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలగజేసే అంశాలను తెలియజేసి భూతాపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజ్‌భవన్‌లలోనూ ‘ఎర్త్ అవర్’ సందర్భంగా గంటపాటు విద్యుత్ దీపాలు, ఉపకరణాలను ఆపేయాలని గవర్నర్లను కోరినట్టు తెలిపారు. శనివారం రాత్రి 8.30 నుంచి గంట పాటు ఎర్త్‌అవర్‌ను పాటిస్తున్నట్టు ఫరీదా తంపాల్ ‘సాక్షి’తో చెప్పారు.
ఎర్త్ అవర్ ప్రచారంలో పాల్గొనండి: గవర్నర్
ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ విజయవాడ రాజ్‌భవన్ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment