
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేస్తామని, ఇందుకు కొంత గడువునివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రిప్లైదాఖలుకు గానూ తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో వ్యాజ్యంలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఉక్కు శాఖ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు.
కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇస్తామని గడువునివ్వాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ వేశామని, ఒక్కో శాఖ తరఫున ఒక్కో కౌంటర్ అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, తాము కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది