AP: హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలు.. ఉండవిక | Government measures to protect mother and child | Sakshi
Sakshi News home page

AP: హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలు.. ఉండవిక

Published Sun, Oct 24 2021 3:03 AM | Last Updated on Sun, Oct 24 2021 11:00 AM

Government measures to protect mother and child - Sakshi

విశాఖ జిల్లా పెనుగొల్లు పీహెచ్‌సీలో వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు

సాక్షి, అమరావతి: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చేవరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారం, మంచి వైద్యం ఇందులో ప్రధానమైనవి. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. అటువంటి సమయాల్లో తల్లీ, బిడ్డకు ప్రమాదమేర్పడుతుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి, గర్భిణికి మంచి వైద్యం అందించడానికి ప్రభత్వం పలు చర్యలు చేపట్టింది. అందులోనూ ప్రసవ సమయంలో తల్లుల మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్‌ (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) ప్రెగ్నెన్సీలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల లోపు ఒకసారి, ఆరు నెలల లోపు మరోసారి వారికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. 7వ నెల దాటాక కూడా హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ అని తేలిన వారికి ఎంసీపీ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌) కార్డులో రెడ్‌ స్టిక్కర్‌ వేస్తారు.

వీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి. ప్రత్యేక వైద్యం అందించాలి. ఇలాంటి గర్భిణుల కోసం ఒక ఏఎన్‌ఎం లేదా ఆశా వర్కర్‌ను కేటాయిస్తారు. గర్భిణులకు ప్రసవం అయ్యేవరకూ వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రధానమంత్రి మాతృత్వ స్వాస్థ్య అభియాన్‌ కార్యక్రమం కింద ఏపీలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తున్నారు.  

13.47 శాతం హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలు 
రాష్ట్రంలో గత ఆరు నెలల్లో  3,56,979 మంది గర్భిణులను గుర్తించగా, వారిలో 57,124 మంది హైరిస్క్‌ గర్భిణులే. అంటే 13.47 శాతం. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. గతంలో 19 శాతంపైనే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఆరు నెలల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ (18 ఏళ్ల నిండకుండా గర్భం దాల్చిన వారు) 2,222 మంది ఉన్నారు. ఎక్కువగా విశాఖ జిల్లాలో 333 టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. 

రక్తహీనతే ప్రధాన కారణం 
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలకు పలు కారణాలు ఉంటాయి. రక్తహీనత,  35 ఏళ్ల తర్వాత (ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ) గర్భం దాల్చడం, పద్దెనిమిదేళ్ల కంటే ముందే గర్భం దాల్చడం, డయాబెటిస్, హైపర్‌ టెన్షన్‌ తదితర కారణాలతో కాన్పు కష్టమవుతుంది. వీటిలో రక్తహీనత ప్రధాన కారణంగా గుర్తించారు. గర్భిణు ల్లోని రక్తంలో హిమోగ్లోబిన్‌ కనీసం 12 గ్రాములు (డెసిలీటర్‌కు) ఉండాలి. అయితే, హైరిస్క్‌ గర్భిణుల్లో 11,437 మందికి హిమోగ్లోబిన్‌ 7 గ్రాములు, అంతకంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. రక్తహీనతే మాతృ మరణాలకు అతిపెద్ద సమస్య. దీనికోసం ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఇవ్వడం, క్రమం తప్పకుండా యాంటినేటల్‌ చెకప్‌(గర్భస్థ పరీక్షలు) చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

హైరిస్క్‌ ఉంటే పీహెచ్‌సీ కాకుండా పెద్దాసుపత్రికి 
హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ ఉంటే వారిని పీహెచ్‌సీలో కాకుండా సీహెచ్‌సీ, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు అనుసంధానం చేస్తున్నాం. వీళ్ల వివరాలు 104, 108 వాహనాలకు ఇస్తాం. అత్యవసరమైతే వారు వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావాలి. ఏఎన్‌ఎం ఒకరిని అటాచ్‌ చేస్తాం. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీపై అవగాహన పెరిగింది. ఎక్కువ మంది పరీక్షలకు వస్తున్నారు. దీనివల్ల మాతృమరణాలు తగ్గించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే ఉచితంగా వైద్యపరీక్షలు అందుతాయి. 
–డా.గీతాప్రసాది, సంచాలకులు,ప్రజారోగ్యశాఖ 

గడిచిన ఆరుమాసాల్లో ఇలా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement