ఊరికో ‘పోషకాహార నిపుణురాలు’ | Nutritionist in every village to increase the consumption of nutritious food | Sakshi
Sakshi News home page

ఊరికో ‘పోషకాహార నిపుణురాలు’

Published Wed, May 26 2021 5:10 AM | Last Updated on Wed, May 26 2021 5:10 AM

Nutritionist in every village to increase the consumption of nutritious food - Sakshi

సాక్షి, అమరావతి: పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచేలా వారిలో ఓ మహిళను ‘పౌష్టికాహార నిఫుణురాలి’గా ఎంపిక చేస్తారు. ఇలా గ్రామ సమైఖ్య (వీవో)కు ఒకరి చొప్పున నియమిస్తారు. ఆ పౌష్టికాహార నిపుణురాలి ద్వారా ఆ గ్రామ సమైఖ్య పరిధిలోని అన్ని పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలందరికీ పౌష్టికాహారం అవసరం ఏమిటి, పౌష్టికాహారం సమకూరాలంటే ఏ ఆహారం తీసుకోవాలి, వాటి తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో గ్రామ పౌష్టికాహార నిపుణురాలితో పాటు ఏఎన్‌ఎం కూడా పాల్గొంటారు. పొదుపు సంఘాల వారీగా మహిళలు ప్రతినెలా నిర్వహించుకునే సంఘ సమావేశాల్లో పోషకార నిపుణురాలు, ఏఎన్‌ఎం పాల్గొని పౌష్టికాహారంపై కొద్దిసేపు అవగాహన కలిగిస్తారు. గ్రామంలోని గర్భిణులు, చిన్న పిల్లల తల్లులతో  పౌష్టికాహార నిపుణురాలు, ఏఎన్‌ఎం ప్రతి నెలా 5, 25వ తేదీల్లో గ్రామ సమైఖ్య ద్వారా సమావేశపరిచి వేర్వేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలకు ఒక విడత ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వారికి పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా గ్రామంలో ప్రతి కుటుంబానికి దీనిపై అవగాహన పెంచవచ్చని సెర్ప్‌ అధికారులు భావిస్తున్నారు. 

అందుబాటులో ఉండే వాటితోనే.. 
గ్రామాల్లో అతి తక్కువ ధరకు దొరికే.. అందరికీ అందుబాటులో ఉండే వివిధ రకాల ఆహార దినుసుల్లో వేటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. ఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి.. వాటివల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న అంశాలపై గ్రామాల్లోని మహిళలందరికీ తెలియజేస్తారు. విటమిన్లు, పోషకాలు గల కూరగాయలతో పాటు సజ్జలు, రాగులు వంటి వాటిని వినియోగించాల్సిన ఆవశ్యకతను చెబుతారు. వీలును బట్టి వాటిని ఇంటి పెరట్లోనే పండించుకునేలా ‘న్యూట్రీ గార్డెన్స్‌’ పేరుతో సంబంధిత విత్తనాలు, మొక్కలను అందించేలా తోడ్పాటునిస్తారు. గర్భిణికి తొమ్మిది నెలలు, ఆ తర్వాత 6 నెలల పాటు బాలింతగా, ఆ తర్వాత పసి పిల్లల తల్లిగా మొత్తం 1,000 రోజుల కాలంలో తల్లీ, బిడ్డ తొలి రెండున్నర ఏళ్ల కాలంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలన్నది ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు చేపడతారు.

రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని ఒకే విడతలో అమలు చేసేలా చర్యలు చేపడతారు. అయితే పౌష్టికాహారం తక్కువ తీసుకుంటున్నట్టు నిర్ధారించిన 218 మండలాల్లో ఫలితాల ప్రాతిపదికన ప్రత్యేకంగా దృష్టి పెడతారు. తొలి ఏడాది 218 మండలాల్లో.. అందులోనూ ప్రత్యేకించి 52 మండలాల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. మరుసటి ఏడాది మరో వంద మండలాల్లో, మూడో ఏడాది మిగిలిన మండలాల్లో కార్యక్రమం ఫలితాల ప్రాతిపదికన ఫోకస్డ్‌గా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement