బాబుగారి ఘనకార్యం
2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రాష్ట్రంలో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య: 43.11 లక్షలు. 2018 ఫిబ్రవరి నెలలో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 44.44 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో కేవలం 39.38 లక్షల మందికి రూ. 447.26 కోట్లను మాత్రమే పంపిణీ చేసింది. 2019 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి కేవలం నెల ముందు 2019 జనవరిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛన్ల మొత్తం రూ. 514 కోట్లు మాత్రమే.
సీఎం జగన్ ఘనత
2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఏడాది లోపే రాష్ట్రంలో పింఛన్‌దారుల సంఖ్య ఏకంగా 61 లక్షలకు పైగా పెరిగిపోయింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రతి నెలా 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తోంది. ఈ నెలలో 62.69 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి, అందులో 62.02 లక్షల మందికి రూ.1,577.07 కోట్లు పంపిణీ చేసింది. కొత్తగా మరో 2,31,989 మందికి పింఛన్లు మంజూరు చేసింది.
వీరిలో 83 వేల మందికి పైగా వృద్ధులు, 75 వేల మంది వితంతువులు, 37 వేల మందికి పైగా దివ్యాంగులు, 20 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో పాటు మరికొన్ని కేటగిరీల్లో మరికొందరు ఉన్నారు. వీటితో కలిపి జనవరి ఒకటో తేదీ నుంచి పింఛన్లు అందుకొనే వారి సంఖ్య ఏకంగా 64,45,226కు పెరిగిపోయింది. ఈ పింఛన్లకు ప్రభుత్వం చేసే నెలవారీ ఖర్చు రూ. 1,775.85 కోట్లు.
ఇది వారి ఏడుపు
అయినా తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీ, వాటికి మద్దతిచ్చే కొన్ని పత్రికలు ప్రభుత్వం పింఛన్లు రద్దు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అందులోనూ కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పుడల్లా వాటి ఏడుపు మరింత తీవ్రంగా ఉంటుంది. చంద్రబాబు సీఎం కావాలన్న ‘పిచ్చే’ వారి ఏడుపుకు కారణం.
–సాక్షి, అమరావతి
జగన్ ప్రభుత్వం రికార్డు
జగన్ సీఎం అయిన నాటి నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే సామాజిక పింఛన్లు రికార్డు స్థాయికి పెరిగాయి. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది. తాజాగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ మూడున్నరేళ్లలో మొత్తం 22.31 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు.
జగన్ సీఎం అయ్యాక వృద్ధాప్య పింఛన్లకు కనీస వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. తద్వారా కొత్తగా అర్హత సాధించిన వారితో కలిపి 2020 జనవరి నెలలో ఒకేసారి 6.12 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ మరుసటి నెలలో మరో 1.31 లక్షల మందికి, 2020 జూన్‌లో మరో విడత 1.16 లక్షలు, 2020 జూలైలో ఇంకొకసారి 2.42 లక్షల మంది, 2021 సెప్టెంబరులో మరొకసారి 2.20 లక్షల మంది.. ఇలా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూనే ఉంది.
పింఛనుదారుల్లో ఎక్కువ మంది వృద్ధులే కావడం వల్ల మరణాలూ ఉంటాయి. గత 8, 10 సంవత్సరాల సరాసరి చూసినా మరణాల కారణంగా ప్రతి నెలా పింఛనుదారుల సంఖ్య తగ్గుతుంది. మరోపక్క అర్హత లేని వాళ్లు పింఛన్లు పొందుతున్నారా అన్న దానిపైన కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి ఆరు నెలలకు సోషల్ ఆడిట్ చేపడుతోంది.
ఏన్నో ఏళ్లుగా ఉన్న నిబంధనల ప్రకారమే.. అనర్హులుగా గుర్తించిన వారికి నేరుగా పింఛన్లు రద్దు చేయకుండా, నోటీసు ఇస్తోంది. వారి అర్హతను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 64 లక్షల మంది లబ్ధిదారుల్లో అతి కొద్ది మంది అనర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకొనేందుకు అధికారులు చేపట్టే చర్యలను, మరణాలను సాకుగా చూపి ప్రభుత్వం లక్షల సంఖ్యలో పింఛన్లను రద్దు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment