అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు దూరం.. 63 కిలోమీటర్లు మధురవాడ నుంచి కాపులుప్పాడకు దూరం.. 8 కిలోమీటర్లు ఇందులో ఏది దగ్గరని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఘనత వహించిన జీవీఎంసీలోని కాంట్రాక్టర్లు మాత్రం మధురవాడ నుంచి కాపులుప్పాడకే దూరం ఎక్కువ అని చెబుతున్నారు. జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారులు సైతం అవునంటూ తాళం వేస్తున్నారు. అంతేకాదు మీరు చెప్పిన సమాధానమే కరెక్టేనంటూ బహుమతి కింద కాంట్రాక్ట్‌ను సైతం అప్పగించారు. ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో.. ఈ బాక్సు టెండర్ల వ్యవహారమెంటో తెలుసుకుంటే మతిపోతోంది.
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు బాక్సు టెండర్లు పిలిచారు. ఓ నెలలో ఒక షాపు నుంచి వచ్చే చికెన్/మటన్ వ్యర్థాలను మధురవాడ నుంచి కాపులుప్పాడకు తరలించేందుకు రూ.110కు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. అయితే, అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు ఇవే వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.100 మాత్రమే కోట్ చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు సైతం గుడ్డిగా తలూపి పనులను అప్పగించారు. ఈ లెక్కన అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు అయ్యే వ్యయం కంటే.. మధురవాడ నుంచి కాపులుప్పాడకు అయ్యే వ్యయమే ఎక్కువని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా అవునంటూ పనులను అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ‘చేపల’ కథ వేరే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్‌లైన్ వద్దు.. బాక్సులే ముద్దు...!
వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను తరలించేందుకు టెండర్లను గత ఏడాది జూన్‌లోనే పిలిచారు. కరోనా నేపథ్యంలో దీనిని రద్దు చేశారు. తాజాగా తిరిగి టెండర్లను పిలిచారు. అయితే ఆన్‌లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్‌లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే చేపడుతున్నారు. అయితే, జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయించడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు.
అక్కడ రూ.100.. ఇక్కడ రూ.110
జీవీఎంసీ పరిధిలో 2019 లెక్కల ప్రకారం 1,600 చికెన్, మటన్ షాపులున్నాయి. రోజూ ఈ షాపుల నుంచి వచ్చే 60 టన్నుల వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లు ఆహ్వానించగా పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లిలో సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించేందుకు షాపునకు రూ.100 అయితే, మధురవాడలోని షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.110 లెక్క టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. వాస్తవానికి అనకాపల్లితో పోల్చుకుంటే మధురవాడ చాలా దగ్గర. అయినా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. చేపల యజమానుల చేతివాటమని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి సేకరించిన వాటిని యలమంచిలి, పెందుర్తిలోని చేపల చెరువులకు తరలించవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చట్టరీత్యానేరం. దీనిపై జీవీఎంసీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment