కడప అర్బన్: బాలికపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలిక మూడు నెలల క్రితం నేరేడుపళ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడున్న బాలురు ఆమెపై అత్యాచారం చేశారు. ఫొటోలు, వీడియో కూడా తీశారు. కాగా, మూడు రోజుల క్రితం ఈ ఫొటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి.
దీంతో, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసును బద్వేల్ రూరల్ పోలీసులు నమోదు చేశారు. 14వ తేదీన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 లేదా తన ఫోన్ నంబర్ 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సాక్షి, అమరావతి: మగపిల్లల నడవడికపై తల్లిదండ్రుల నిఘా లోపిస్తే విద్యార్థి దశలో నేరాలకు పాల్పడే ప్రమాదముందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. గోపవరం మండలం రాచాయపేటలో వెలుగుచూసిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై ఆమె శనివారం స్పందించారు. కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో మైనర్లు నేరానికి పాల్పడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
బాలికపై అత్యాచారం, అశ్లీల వీడియోలు బయట పెట్టడం తదితర అంశాలు తీవ్రంగా మనసును కలచివేశాయన్నారు. క్రమశిక్షణ కొరవడటం, సెల్ ఫోన్ల వినియోగంతో ఇష్టారీతిగా ప్రవర్తించడం జీవితాలపై ప్రభావం చూపుతుందని వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఇంటి వాతావరణంలో పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారాన్ని నేర్పే కౌన్సెలింగ్ అవసరమన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : మైనర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి అన్నారు. బాధితురాలి ఆరోగ్యంపై స్థానిక ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. బాలిక మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment