ఆ ఫిర్యాదులో పిటిషనర్ల ప్రస్తావన ఎక్కడా లేదు
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 2021లో కేసు నమోదైతే ఇప్పుడు నిందితులుగా చేర్చి వేధిస్తున్నారు
పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
హైకోర్టును అభ్యర్థించిన సీనియర్ న్యాయవాదులు
విచారణ సోమవారానికి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తమను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నేత దేవినేని అవినాష్, పలువురు కార్యకర్తలు హైకోర్టుకు నివేదించారు. ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ల పేర్లు లేవని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎల్.రవిచందర్, పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి తెలిపారు.
టీడీపీ పార్టీ కార్యాలయంపై తాము దాడి చేసినట్లు ఫిర్యాదుదారే చెప్పడం లేదని, పోలీసులు మాత్రం తమను నిందితులుగా చేర్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. కేసు 2021లో నమోదైతే ఇప్పుడు తమను నిందితులుగా చేర్చి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు. సహ నిందితులు ఇచ్చే వాంగ్మూలానికి న్యాయపరంగా ఎలాంటి విలువ లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని కోర్టుకు నివేదించారు.
రాజకీయాలకు సామాన్యులు బలి..
మూడేళ్ల తరువాత కేసు విచారణ జరుగుతోందని, ఈ జాప్యానికి కారణాలు ఏమిటో దర్యాప్తు అధికారి చెప్పడం లేదన్నారు. కేసు దర్యాప్తులో జాప్యం ఉండదకూడదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అసాధారణ, నిరవధిక జాప్యాన్ని ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దల రాజకీయాలకు సామాన్యులు బలవుతున్నారని తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై దాడులు జరిగితే పోలీసులు, ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదన్నారు.
నిందితుల తరఫున కేసులు వాదించిన న్యాయవాది గవాస్కర్‌ను నిందితునిగా చేర్చారని, రేపు ఈ కేసులు వాదిస్తున్నందుకు తనను కూడా నిందితునిగా చేర్చే అవకాశం ఉందని పొన్నవోలు తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment