వైఎస్సార్‌సీపీ నేతల విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ ఎమెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్‌కు హైకోర్టు ఊరటనిచ్చిది. తదుపరి విచారణ వరకు వారిపై ఎలాంటి తొందరపాటు.. కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి, రఘురాం, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించేందుకు సిద్ధమవ్వగా.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు ఒకేసారి వింటానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పొన్నవోలు జోక్యం చేసుకుంటూ.. అలా అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లకు తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. తదుపరి విచారణ వరకు పిటిషనర్ల విషయంలో ఎలాంటి తొందరపాటు, కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. కాగా, గతంలో చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదైన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ విషయంలో కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment