సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం నైపుణ్య కేంద్రాల పేరుతో కుంభకోణం చేసిందన్న విషయాన్ని హైకోర్టు కూడా నమ్మిందని.. అందుకే చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. శాసన మండలిలో మంగళవారం స్కిల్ కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాధవరావు మాట్లాడారు. రెండున్నరేళ్లు దర్యాప్తు చేసి.. 140 మందిని విచారించి.. పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు.
చంద్రబాబు నిజాయితీపరుడని, రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఐడీ విచారణలో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని నిర్థారించుకున్న తర్వాతే ఆయనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ కుంభకోణం వాస్తవంగా 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందన్నారు. జీఎస్టీ ఎగ్గొట్టారంటూ నోటీసులు వస్తే.. దానిపై దర్యాప్తు చేయకుండా ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి నోట్ ఫైల్స్‌ను మాయం చేసిన ఘనులు వీరంటూ విమర్శించారు.
ముసలోడు నేరం చేస్తే ఒప్పా?
73 ఏళ్ల వ్యక్తిని అవినీతి కేసులో అరెస్ట్ చేశారని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు తప్పు చేసినా వదిలేయాలని చట్టంలో ఎక్కడైనా ఉందా అని మాధవరావు ప్రశ్నించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా వాదించడం లేదని, సెక్షన్ 17ఏ ఆయనకు వర్తించదంటున్నారని చెప్పారు. ఐటీ అధికారులు నోటీసులు ఇస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ సాంకేతిక సమస్యలు చూపించి తప్పించుకుంటున్నారని, అరెస్ట్ చేస్తానంటే జైల్‌లో కాదు హౌస్ అరెస్ట్ చేయండని విచిత్రమైన వాదనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment