
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించారని, పాత జాబితా ప్రకారమే కేటాయింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఇళ్ల కేటాయింపులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనకాపల్లికి చెందిన దొడ్డి వీఎస్ జగదీశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై ధర్మాసనం విచారణ జరిపింది.(చదవండి: టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పక్కాగా వ్యవహరించాలి)
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. 904 మందిని తొలగించడానికి గల కారణాలను కోర్టుకు తెలిపారు. గతంలో పలువురు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు పొందారని, మరికొందరు అసలు టిడ్కో ఇళ్లు పొందేందుకు ఏ మాత్రం అర్హులు కారని, ఇలా పలు కారణాలతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment