
సాక్షి, అమరావతి: ఇంటికి చుట్టాలొచ్చినట్టే.. పర్యాటకులొస్తారు. మన ఇంట్లో తయారు చేసిన భోజనాన్నే తింటారు. ఇందుకు ప్రతిగా నగదు చెల్లిస్తారు. గ్రామీణ పర్యాటకంలో ఈ రకమైన ‘హోమ్ స్టే’ అనేది ట్రెండీ కాన్సెప్‌్టగా నిలుస్తోంది. వాణిజ్య వసతి గృహాలకు అవకాశం లేని గ్రామాలు, మారుమూల పల్లెల్లో ఇది స్థానికులకు ఉపాధి వనరుగా మారి వారికి ఆరి్థక భరోసానిస్తోంది. సంపూర్ణ పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. అలాగే పర్యాటకులకు హోటళ్లలో ఉండేందుకు అయ్యే ఖర్చులో సగం మాత్రమే అవుతుండటంతో వారు కూడా హోమ్ స్టేపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో చాలా తక్కువగానే అయినా ఈ విధానం కొనసాగుతోంది. కోనసీమ ప్రాంతాల్లో పూర్వీకుల పాత పెంకుటిళ్లను పెద్దల గుర్తుగా కాపాడుకుంటూనే ‘హోమ్ స్టే’ విల్లాలుగా మారుస్తున్నారు. ప్రస్తుతం కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, గ్రామీణులకు ఆరి్థక భరోసానిస్తూ హోమ్ స్టే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ సందర్శనీయ స్థలాల్లో పర్యటించాలనుకునే వారు హోటళ్లు, రిసార్ట్‌లలో కంటే గ్రామీణుల మధ్య వారి ఇళ్లల్లోనే, స్థానిక ఆహార సంప్రదాయాలు, సాంస్కృతిక జీవనంలో మమేకమవుతున్నారు. ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో సైతం హోమ్ స్టే బుకింగ్‌ను అందుబాటులో ఉంచారు.
ఏపీలోనూ ‘హోమ్ స్టే’ విస్తరణకు అధికారుల ప్రణాళికలు
కళల పరిశ్రమలు, సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా కళలు, ఆచారాలు, ఆహార సంప్రదాయాలు, భాషలు, వేషధారణ, సాంస్కృతిక జీవనశైలిని దేశీ, విదేశీ పర్యాటకులు ఆస్వాదించొచ్చు. ఇందులో భాగంగా హోమ్ స్టే విధానంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించనున్నారు. వాణిజ్య ఆతిథ్య రంగంలో పాటించే సకల భద్రత ప్రమాణాలను హోమ్ స్టేలోనూ అమలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తిగల ఇళ్ల యజమానులు పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
పరస్పర సాంస్కృతిక మార్పిడికి అవకాశం
హోమ్ స్టే విధానంతో అతిథి, హోస్ట్ పరస్పర సాంస్కృతిక మారి్పడికి అవకాశం ఉంటుంది. వివిధ జాతుల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించే వేదికగా గ్రామాలు మారుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా వలసలు తగ్గుతాయి. స్థానికులు స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై బాధ్యత కూడా పెరుగుతుంది. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ
Comments
Please login to add a commentAdd a comment