మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంత పేదలు త్వరలోనే గృహప్రవేశం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల సొంతింటి కల సాకారం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం కార్పొరేషన్, గుడివాడ, ఉయ్యూరు మునిసిపాలిటీల పరిధిలో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి, డిసెంబర్ నాటికి వాటిలో లబ్దిదారులతో పాలు పొంగించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గృహ సముదాయాల్లో రూ.139.29 కోట్లతో రహదారులు, అండర్ డ్రెయిన్ల నిర్మాణం, విద్యుదీ్ధకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
అసంపూర్తిగా వదిలేసిన టీడీపీ ప్రభుత్వం
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో నాటి పాలకులు టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా వదిలేశారు. లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తోంది. మచిలీపట్నం, గుడివాడలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఉయ్యూరులో 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి.
రుణాలతో ఆర్థిక చేయూత
గృహ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వీలుగా లబి్ధదారులకు తక్కువ వడ్డీతో ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 365 చదరపు గజాల విస్తీర్ణం గల గృహానికి రూ.3.15 లక్షలు, 430 ఎస్‌ఎఫ్‌టీ గృహాలకు రూ.3.65 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంకులను నిర్దేశించింది. మెప్మా అధికారులకు బాధ్యతలు అప్పగించటంతో లక్ష్యసాధన కోసం ప్రస్తుతం రుణ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఒక్కరే కావటంతో రుణాల లక్ష్యసాధనలో తడబాటు నెలకొంది.
రూ.356.81 కోట్లు రుణ లక్ష్యం
గుడివాడలో ఫేజ్–1 కింద మంజూరైన 2,912 మంది, ఫేజ్–2 కింద మంజూరైన 7,328 మందికి, మచిలీపట్నంలో 960 మందికి, ఉయ్యూ రులో 1,776 మందికి అవసరమైన రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ బ్యాంక్, యూకో బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించేలా కార్పొరేషన్, మునిసిపాలిటీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
10,064 మందికి మొత్తం రూ.356.85 కోట్ల రుణాలను ఇప్పించాలనేది లక్ష్యం. ఈ నెల 21వ తేదీ నాటికి 8,615 మంది లబ్దిదారులతో బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్‌చేయించారు. లోన్ డాక్యుమెంటేషన్ పూర్తయిన 8,583 మందిలో ఇప్పటి వరకు 4,323 మందికి వివిధ బ్యాంకుల రుణాలు మంజూరు చేశారు. 4,309 మంది బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే రుణాలు జమయ్యాయి.
సకాలంలో పూర్తి
టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నతాధికారులు సైతం తరచూ సమీక్షిస్తున్నారు. డిసెంబర్‌లో ఇళ్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులపై దృష్టి సారించాం. లబి్ధదారులకు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు ఉపయోపగపడుతున్నాయి. మునిసిపల్, మెప్మా అధికారుల సమన్వయంతో దీనిపై ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయి.
– చిన్నోడు, టిడ్కో జిల్లా ప్రాజెక్టు అధికారి
Comments
Please login to add a commentAdd a comment