గోదావరి ఉగ్రరూపం | Huge Flood Water To Godavari With Heavy Rainfall | Sakshi
Sakshi News home page

గోదావరి ఉగ్రరూపం

Published Sun, Aug 16 2020 3:49 AM | Last Updated on Sun, Aug 16 2020 3:49 AM

Huge Flood Water To Godavari With Heavy Rainfall - Sakshi

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతంలో వరద నీరు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/సాక్షి, కాకినాడ: పరీవాహక ప్రాంతంలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద శనివారం ఉ.7 గంటలకు వరద నీటి మట్టం 46 మీటర్లకు చేరడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. తాలిపేరు ప్రాజెక్ట్‌ నుంచి 23 గేట్లు పూర్తిగా ఎత్తి 1.23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే.. 

► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు 13 లక్షల క్యూసెక్కులకు పైగా చేరుతుండటంతో వరద నీటి మట్టం 27.80 మీటర్లకు చేరింది. స్పిల్‌వేలోకి భారీగా వరద నీరు చేసింది. వరద  మరింత పెరిగే అవకాశం ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. 
► ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం గంటగంటకూ పెరుగుతోంది. శనివారం ఉ.6 గంటలకు 7.19 లక్షల క్యూసెక్కులు.. మ.12.30 గంటలకు అది 10 లక్షల క్యూసెక్కులకు చేరింది. సా.6గంటలకు 12.60లక్షల క్యూసెక్కులు రాగా..  రాత్రికి 13.75 లక్షల క్యూసెక్కులు దాటుతుందని.. రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.  
► వచ్చిన వరదను వచ్చినట్టు 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు.  
► ఇక ఎగువ సీలేరులోని గుంతవాడ రిజర్వాయర్‌ నిండుకుండలా మారడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు.  
► విలీన మండలాలైన చింతూరు, కూనవరం వీఆర్‌ పురం, ఎటపాక మండలాలతోపాటు దేవీపట్నం మండలం వరద ముంపులో చిక్కుకున్నాయి. ఎద్దెలవాగు, రుద్రంకోట వాగు పొంగిపొర్లుతున్నాయి.  
► పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి వరద పోటెత్తడంతో కుక్కునూరు మండలం లచ్చగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.  
► లంక, లోతట్టు, ముంపు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో కూడిన బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కాకినాడలో శనివారం తెలిపారు.  

శ్రీశైలంలోకి స్థిరంగా వరద 
శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన జూరాల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి.. సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన తుంగభద్ర వరద తోడవడంతో శనివారం సా.6 గంటలకు ప్రాజెక్టులోకి 1.25 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 136.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ జెన్‌కో 42,987 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

► ఇక నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 246.54 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన కురిసిన వర్షాలతో పులిచింతల ప్రాజెక్టులోకి 3,426 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 
► ఇక ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలవల్ల పులిచింతలకు దిగువన కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 77,371 క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 52,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం రాత్రికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  
► తుంగభద్ర డ్యామ్‌లో నీటి నిల్వ 96.38 టీఎంసీలకు చేరుకుంది. మరో నాలుగు టీఎంసీలు చేరితే డ్యామ్‌ నిండిపోతుంది.  
► దిగువకు విడుదల చేస్తున్న వరదను కర్ణాటక తగ్గించింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరగానే.. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేయనుంది. దీంతో శ్రీశైలంలోకి మళ్లీ వరద పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement