జాబ్‌మేళా ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేగౌడ్ తదితరులు
‘రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపాలి. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. తల్లిదండ్రులతోపాటు ఆ కుటుంబాలకు అండగా నిలవాలి’ అనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. రాయలసీమ జిల్లాల్లోని యువతీయువకులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్‌మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సత్తాచాటి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు.
సాక్షి, తిరుపతి రూరల్/తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోనే మొదటి సారి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి పాదా ల చెంత శనివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభిచింది. ఎస్వీ ఆడిటోరియంలో ఎంపీ విజయసాయిరెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి దేవేంద్రరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటైన జాబ్‌మేళాకు రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 43 వేల మంది హాజరయ్యారు. వీరంతా మెగా జాబ్‌మేళా అఫిషియల్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.
పది. ఇంటర్, డిప్లొమో, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్హత, అనుభవం, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉద్యోగాలు సాధించిన 4,784 మందిలో తక్షణం 410 మందికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేశారు.
చరిత్రలో మొదటి సారి
తిరుపతి చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా నిర్వహించింది. సరిగా నడవలేని స్థితిలో కొందరు, చంటిబిడ్డలతో మరికొందరు, డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాని యువతీయువకులు ఎందరో.. సర్టిఫికెట్లు చేతబట్టి తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్‌మేళా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలు కిక్కిరిసిపోయాయి. జాబ్‌మేళాలో చంద్రగిరి, సత్యవేడు, పలమనేరు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలం, వెంకటేగౌడ్, ప్రభుత్వ సలహాదారు (ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్) చల్లా మధుసూదన్‌రెడ్డి, జాబ్‌మేళా తిరుపతి ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు..
పక్కాగా ఏర్పాట్లు
►మెగాజాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులకు నేతలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
►పోలీస్ బృందాలతో భారీ బందోబస్తుతోపాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశారు.
►ఎండ వేడిమికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి చోటా షామియానాలు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఇబ్బందులు పడకుండా భోజనం సమకూర్చారు.
►దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. మూడు చక్రాల సైకిళ్లలో జాబ్‌మేళా కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టారు.
►జాబ్‌మేళా కేంద్రాల ప్రత్యేక సూచిక బోర్డులు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ప్రతి గదిలోనూ అభ్యర్థులకు సలహాలిచ్చేందుకు వలంటీర్లను నియమించారు.
గొప్ప అవకాశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మెగా జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగులకు గొప్ప వరం. పెద్ద కంపెనీల ద్వారా జాబ్‌మేళా నిర్వహించారు. ఇంటర్వుల్లో పాల్గొని సాఫ్ట్ వేర్‌గా ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు కృతజ్ఞతలు.
– ఖాజా మస్తాన్, కావలి
కల నెరవేరింది
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్న కల నెరవేరింది. ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూశాను. ఈ మెగా జాబ్ మేళా ద్వారా అది సాధ్యమైంది. బంధువులు స్నేహితులతో గర్వంగా సాఫ్ట్‌వేర్ అని చెప్పుకోగలను. అమ్మనాన్నలకు నా వంతు సహకారం అందిస్తా.
– హారికారెడ్డి, తిరుపతి
పేర్లు నమోదు చేసుకోండి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగాజాబ్ మేళా నిరంతర ప్రక్రియ. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి మళ్లీ ప్రయత్నించాలి. రిజిస్ట్రేషన్ల కోసం వైఎస్సార్‌సీపీ ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.
– విజయసాయిరెడ్డి, ఎంపీ
ఇది ప్రారంభం మాత్రమే
తిరుపతి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మేగా జాబ్‌మేళా రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు వరం. సామాజిక బాధ్యత, నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఇంతపెద్ద మెగాజాబ్ మేళా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా పార్టీ లక్ష్యం.
– గురుమూర్తి, ఎంపీ తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment