దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం
జగన్ హయాం కంటే ఇప్పుడే రేటు ఎక్కువ అంటున్నారు..
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఫీడ్‌బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య
ఇక మిగిలిన నిల్వ 24.08 లక్షల టన్నులే
సాక్షి, అమరావతి: ఇసుక పేరుతో సాగుతున్న దోపిడీ వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో ఆ తప్పంతా అధికార యంత్రాంగంపై నెట్టివేసేందుకు సీఎం చంద్రబాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకలో దాదాపు 40 లక్షల టన్నులు మాయం చేసి అందినకాడికి విక్రయించి పచ్చముఠాలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకూ తరలించారు. నిత్యం తవ్వుకో తమ్ముడూ అంటూ రీచ్‌ల్లోనూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇతర మీడియాల్లోనూ దీనిపై కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. వైఎస్ జగన్ సర్కారు హయాంలో కంటే ఇసుక ధర ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గతంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోందని ప్రస్తావించారు. స్టాక్ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా విక్రయించినప్పుడు కళ్లు మూసుకుని బుకాయించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీన్ని అధికారులపై నెట్టివేసే యత్నాలపై యంత్రాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్రంలో 59 ఇసుక యార్డుల్లో ఇక 24.08 లక్షల టన్నులు ఇసుక మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment