సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సెయిలర్స్ కోసం సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్‌ఎస్ విశ్వకర్మ బేస్‌లో ఉన్న సెయిలర్స్ ఎనెక్స్ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. సాగర్ పేరుతో ఆధునికీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం ప్రారంభించారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేసిన సాగర్‌లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్‌లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్‌సీ చీఫ్ అడ్మిరల్ పెందార్కర్ తెలిపారు. భారత దేశ రక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సెయిలర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు.
నౌకాదళ సిబ్బందికి ‘ఏఐ’ క్యాప్సుల్ కోర్సు
సాంకేతిక పరిజ్ఞానంలో నౌకాదళ సిబ్బంది ప్రతిభా పాటవాలు మెరుగు పరిచేందుకు తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాప్సుల్ కోర్సును అందించారు. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐఎన్‌ఎస్ కళింగలో ఈనెల 10 నుంచి 3 రోజుల పాటు ఏఐ అప్లికేషన్స్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా సందేహాలు నివృత్తి చేయడంతో వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్‌లో ప్రయోగాత్మక వివరణలు అందించారు. శిక్షణలో పాల్గొన్న తూర్పు నౌకాదళ సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment