సాక్షి, అమరావతి : చిరుతను చూసి మనం భయపడతాం గానీ.. అసలు అంతకన్నా ముందే దానికి మనుషులంటేనే చచ్చేంత భయం. మనుషులపై దాడి చేసే సాహసం చేయదు. మనుషుల్ని చూడగానే చిరుతలు భయంతో దూరంగా పారిపోతాయి. కానీ మనమేమో అది మన మీద దాడి చేస్తుందేమోనని బెంబేలెత్తిపోతాం. ‘జనావాసంలోకి చిరుత పులి..’ అంటూ తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి జనం చిరుత పులిని చూసి రాళ్లతో తరిమికొట్టిన ఘటనలూ రాష్ట్రంలో చూశాం. నాలుగు రోజుల కిందట తిరుపతి బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న కుక్కపై చిరుత దాడి చేసింది. అసలు చిరుతల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అనుకోని రీతిలో దాన్ని చుట్టుముట్టినప్పుడు భయంతో మీదపడటం తప్ప, అది జనంపై దాడి చేసి గాయపర్చిన సందర్భాల్లేవంటున్నారు.
ఆహారం, నీరు దొరక్క..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమకు తెలియకుండానే అవి జనారణ్యంలోకి వచ్చేస్తాయి. అడవులు, గడ్డి భూములే చిరుతల నివాస ప్రాంతాలు. పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి గడ్డి భూములు, డంపింగ్ యార్డుల వంటిచోటా అవి జీవిస్తాయి. సరిపడా ఆహారం, నీరు ఉన్నంతకాలం అవి తమ పరిధిలోని ఆవాస ప్రాంతంలోనే సంచరిస్తాయి. ఆ రెండు లేనప్పుడు వాటిని వెతుక్కుంటూ బయటకొస్తాయి.
పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో వాటి ఆవాస ప్రాంతాలు కుచించుకుపోవడం, నీటి చలమలు తగ్గిపోవడంతో వాటి మనుగడకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అవి ఆహారాన్వేషణలో అనుకోకుండా సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. చిరుతలకు కుక్కలంటే మహాప్రీతి. వాటికోసం అప్పుడప్పుడు జనాలు ఉన్న చోటుకు వచ్చి వాటిని వేటాడతాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 మధ్య చిరుతలు చురుగ్గా ఉంటాయి. అప్పుడే ఇతర జంతువులను వేటాడతాయి.
మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదు..
చిరుత పులులు అన్ని ప్రాంతాల్లోనూ మనుగడ సాగించగలవు. కుక్కలు ఇతర చిన్న జంతువులున్నచోట కూడా అవి బతికేస్తాయి. వాటివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 99 శాతం అవి మనుషులకు కనపడకుండానే తిరుగుతాయి. రాష్ట్రంలో చిరుతల వల్ల మనుషులు గాయపడినట్టు ఎక్కడా రికార్డవలేదు. రాష్ట్రంలో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
– రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణుల విభాగం, ఏపీ)
Comments
Please login to add a commentAdd a comment