విజయవాడ పటమటకు చెందిన 45 ఏళ్ల రమేష్ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, దీర్ఘ ఆలోచనలు చేయడంతో పలు రోగాల బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమీ లేదని తిప్పి పంపేవారు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తేల్చారు.
లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్‌ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి గానీ నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీసుకు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తల తిరుగుతుంది.. కడుపులో తిప్పుతుంది.. గుండె పట్టుకుంటుంది.. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుంది..! అదే డిప్రెషన్. ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిరంతరం ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుందని, ఇన్‌ఫెక్షన్స్ పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా గుర్తించండి..
నిద్రలేమి, ఎల్లప్పుడూ దిగులుగా ఉండటం.. ఏకాగ్రతా లోపించడం వంటి సమస్యలు ఉంటే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్‌తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాట పడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి.
కొరవడిన మానసికోల్లాసం
నగరంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో వారిలోని సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువుల్లో రోబోలుగా మారుతున్నారు. వారిలో సామాజిక, నైతిక విలువులు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు.
ఒత్తిడితో దుష్ప్రభావాలు
♦ నిద్ర పట్టక పోవడం
♦ ఆకలి లేక పోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం
♦ఎక్కువ తినేవారు ఒబెసిటీకి గురవడం
♦ హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు
♦ మధుమేహం, రక్తపోటు అదుపులోలేకపోవడం
♦ తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు
♦ వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్‌ఫెక్షన్స్ సోకడం జరుగుతుంది.
ఇలా జయించొచ్చు
♦ రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, ఒకే సమయానికి రోజూ పడుకోవాలి.
♦ సమతుల ఆహారం తీసుకోవాలి.
♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
♦ యోగ, మెడిటేషన్‌పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి
♦ సెల్‌ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి.
♦ భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి.
♦ అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి.
ఒత్తిళ్లతో రుగ్మతలు
తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతుంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నిద్రలేక పోవడం, ఎక్కువ ఆహారం తినడం కారణంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ విజయలక్ష్మి, మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ
యువతలో తీవ్రమైన ఒత్తిడి
ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారాలు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment