తల్లి పాలే తొలి టీకా! | Breastfeeding Contains Many Valuable Nutrients For Children | Sakshi
Sakshi News home page

తల్లి పాలే తొలి టీకా!

Published Sat, Jul 31 2021 11:48 PM | Last Updated on Sat, Jul 31 2021 11:53 PM

Breastfeeding Contains Many Valuable Nutrients For Children - Sakshi

తల్లిపాలలో ఎన్నెన్నో అమూల్యమైన పోషకాలు ఉంటాయి. వాటిని అధ్యయనం చేయాలనుకుని సంకల్పిస్తే ఇంతవరకు మన పరిశీలనకు అందినవి కేవలం 400 రకాల పోషకాలే. కానీ నిజానికి అంతకంటే ఎక్కువ పోషకాలే అందులో లభ్యమవుతాయి. అందునా వాటిని కృత్రిమంగా తయారుచేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో అనేక రకాల ఫార్మూలా ఫీడ్స్‌ అందుబాటులో ఉన్నా... అవేవీ తల్లిపాలకు సాటిరావు. 

బిడ్డ పుట్టగానే ఊరే ముర్రు పాలు!
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్‌ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరూ, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరూ అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్‌ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. దాంతో ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుతాయి. ముర్రుపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడం అతిశయోక్తి కాదు. 

ముర్రుపాల తర్వాత... 
ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు ఆర్నెల్ల వయసు వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వండిన అనువైన అదనపు ఆహారం ప్రారంభించి, రెండేళ్ల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలూ పడుతూ ఉండాలి. ఇది బిడ్డ పూర్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వారి సూచన. 

పాలిచ్చే తల్లులకుS కొన్ని సూచనలు 
కరోనా సోకిన తల్లి సైతం తన బిడ్డకు తల్లిపాలు పట్టడం చాలా ఉత్తమం. మాస్క్‌ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్‌), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్‌) కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఇక్కడ పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే, పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. 

పాలిచ్చే తల్లి దాహం తీరేంతగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువగా తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. 

తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్‌ తగినంతగా సమకూరడానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్‌–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్‌ వంటివి. 

తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్‌ వంటివి తీసుకోవాలి. 

క్యాల్షియమ్‌ అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ పుష్కలంగా తీసుకోవాలి. 

విటమిన్‌ బి12తో పాటు విటమిన్‌ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే విటమిన్‌ బి12, విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. 

ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా ఆదా అవుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. 

తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలేలివే... 
నీరు : పాలలో ఎక్కువ భాగం (87 – 88 శాతం) నీరు ఉంటుంది. 
ప్రోటీన్లు : బిడ్డకు సరిపడినన్ని (0.9 – 1 %) ప్రోటీన్లు ఉంటాయి. 
కొవ్వు పదార్థాలు : శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్‌ ఫాటీ యాసిడ్స్‌)తో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి హెల్దీ కొవ్వు పదార్థాలు కావాల్సిందే. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్‌ఏ అనే కొవ్వుపదార్థం ఉంటుంది. డీహెచ్‌ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్‌ యాసిడ్‌ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్‌. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. అంతేకాదు... కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల కంటిలోని రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్‌ అనే కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది.

ఈ రెటీనా నిర్మితమయ్యే కొవ్వులలో... 93 శాతం ఈ డీహెచ్‌ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వు పదార్థాలూ  ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్‌ఏ అంటారు. ఆరాకిడోనిక్‌ యాసిడ్‌ అనే మాటకు ఏఆర్‌ఏ సంక్షిప్త రూపం. మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్‌ఏ సమకూర్చుతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నింటినీ అమ్మ నుంచి బిడ్డకు అందేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వు పదార్థాలన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వు పదార్థాలు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వు పదార్థాలను రిజర్వ్‌లో ఉంచుకోవాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. 

తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు
తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో అంటువ్యాధులు రాకుండానూ, అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక దీర్ఘకాలిక జబ్బుల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అవి... 

తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. 
పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 
తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. 
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తద్వారా పెద్దయ్యాక డయాబెటిస్, అధిక రక్తపోటు, తదితర దీర్ఘకాలిక జబ్బులు రావడం చాలా తక్కువ. 
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (చైల్డ్‌హుడ్‌) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 
నవజాత శిశువులలో నెక్రొటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే.

ఏయే మోతాదుల్లో తల్లిపాలు 
పిల్లలు తల్లిపాలు తీసుకునే పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలుంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్‌’ పండంత సైజు ఉంటుంది.

తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. తల్లిపాలు అవసరం. అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తూ... అలాగే నిర్దేశించిన విధంగా బరువు పెరుగుతూ ఉంటే... ఆ పిల్లలకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం.  

కొన్ని గణాంకాలు  
నవజాత శిశువులు మొదలుకొని పాలు తాగే చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి, శారీరక, మానసిక వికాసాలకు తల్లిపాలు అవసరంపై అవగాహన ఉన్నప్పటికీ... గణాంకాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2019–20 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5) ప్రకారం... దాదాపు 88% తల్లులు ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిస్తున్నారు. అందులో కేవలం 51% మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలో తల్లిపాలు పట్టడం ప్రారంభిస్తున్నారు. 61.9% మంది తల్లులు మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే పడుతున్నారు. కేవలం 56% మంది పిల్లలు మాత్రమే 6–8 నెలల్లో ఆ వయసుకు తగినట్లుగా అదనపు ఆహారం పొందగలుగుతున్నారు.

ఫలితంగా మన దేశంలో 26.9% మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుంటున్నారు. 31.9% మంది పిల్లలు తమ వయసుకు ఉండాల్సిన ఎత్తు పెరగడం లేదు. 18.1% పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. 5.5% పిల్లులు ఊబకాయంతో ఉన్నారు. దేశంలోని దాదాపు సగం మంది పిల్లలకు అత్యంత శ్రేష్ఠమైన, ఎన్నెన్నో పోషకాలతో కూడిన, మంచి వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే ముర్రుపాలు అందడం లేదు. ఇంకా చెప్పాలంటే గత ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4తో (2015–16) పోల్చినప్పుడు తాజా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5లో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టే శాతం 2.5% తక్కువగా ఉంది.

దీన్నిబట్టి పుట్టగానే తల్లిపాలు పట్టించే సంస్కృతిని పెంపొందించుకోవడం అవసరమనీ, అపోహలేమీ లేకుండా ముర్రుపాలను ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనీ... ఈ మేరకు దేశంలోని దాదాపు సగంమంది తల్లులకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తేలుతోంది.డబ్ల్యూహెచ్‌ఓ 1981లో తీసుకొచ్చిన తల్లిపాల ప్రత్యామ్నాయాల నియంత్రణ చట్టాన్ని అనుసరించి... భారత ప్రభుత్వం 1992లో తల్లిపాల ప్రత్యామ్నాయాలు పాలసీసాలు, శిశు ఆహారాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. కొన్ని చట్ట సవరణలతో ఇది మళ్లీ 2003లో సమగ్ర చట్టంగా రూపొంది, అమల్లో ఉంది. దీని ప్రకారం పరిశ్రమల ఉత్పత్తుల  వాణిజ్యప్రకటనలు, ప్రోత్సాహకాలను నియంత్రించి... పేరెంట్స్‌ వాటివైపు ఆకర్షితులు కాకుండా చూడాలి. ఈ చట్ట నిబంధనలూ, వాటి ఉల్లంఘనల పర్యవసానాలపై అవగాహన కల్పించడమే ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాల ప్రధానోద్దేశం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement