
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
ఇది మా సొంతిల్లు
వర్షాకాలం వస్తుందంటే చాలు.. ఇంటిల్లిపాదీ భయంతో వణికిపోయేవాళ్లం. ఎలా తలదాచుకోవాలని ఒకటే బెంగ. చిన్న ఇంటిలో 20 మంది ఉంటున్నామంటే మాటలు కాదు. పిల్లలు నరకయాతన అనుభవించేవారు. ఆ నాలుగు నెలలూ దిక్కుతోచేది కాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించాలన్నా భయమే.. వచ్చే బంధువులను ఎక్కడ కూర్చోబెట్టాలని. 20 ఏళ్లుగా ఇల్లు కట్టుకోవాలని మా అన్నదమ్ములం చేయని ప్రయత్నం లేదు. కానీ సెంటు భూమి కూడా కొనలేకపోయాము. ఆ దిగులుతో మా తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారు.
చిన్న ఇల్లు కావడం వల్ల నలుగురిలో మేము పలచబడిపోయాం. సొంతంగా ఇల్లు కట్టుకునే స్థోమత లేక అనేక నిద్రలేని రాత్రుళ్లు గడిపేవాళ్లం. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెంలో ఉండే మాకు సెంటు జాగా కూడా లేదు. నేను ఆటో డ్రైవర్‌ను. నా భార్య రమణ రోజువారి కూలీ. మాకు ఇద్దరు సంతానం. మొదటి నుంచి మాది ఉమ్మడి కుటుంబం. మా నలుగురు అన్నదమ్ముల భార్యా, పిల్లలు, మా అమ్మ, నాన్న అందరం కలిసి 20 మందిమి ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. చిన్న ఇల్లు కావడం వల్ల ఇరుకుతో ఇబ్బందులకు గురయ్యేవాళ్లం.
ఈ నేపథ్యంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు, మా అన్నదమ్ములకు ఇంటి స్థలంతోపాటు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలతో పాటు మేము కూడబెట్టుకున్న పైసాపైసా డబ్బు కలుపుకొని ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నాను. మా ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి స్వయంగా వచ్చి మా ఇల్లు ప్రారంభించారు. ఇప్పుడు సొంతింట్లో కుటుంబంతో హాయిగా ఉంటున్నాము. సీఎం జగన్ పుణ్యమా అని నా సొంతింటి కల తీరింది. – కామునూరి తిరుపతిరావు, మాదాలవారిపాలెం (మోరా శ్రీనివాసరెడ్డి, విలేకరి, పొదిలి రూరల్)
పింఛన్ నడుచుకుంటూ ఇంటికొస్తోంది..
నాకు పాత కాలం నాటి చిన్న ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వివాహం కూడా కాలేదు. నా అనేవారు ఎవరూ లేరు. అంగవైకల్యానికి తోడు పక్షవాతం వచ్చింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బండపల్లెలో ఉంటున్నాను. ఇదివరకు నాకు వికలాంగుల పింఛన్ కింద రూ.3 వేలు వచ్చేది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పెరాలసిస్ బాధితుడి కింద రూ.5 వేలకు పెరిగింది. నేను అడగకపోయినా 3 వేల నుంచి ఒకేసారి 5 వేలకు పెంచారు. అదీ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. నాలా నడవలేని వారికి ఇదొక వరం.
ఈ మనసున్న సీఎం ఉన్నంత వరకు మాలాంటోళ్లకు భయం లేదు. ఒంటరిగా జీవిస్తున్న నాకు ఈ పింఛనే జీవనాధారం. ఇంటి నుంచి బయటకు వెళ్లలేను. ఇరుగుపొరుగు వారి సాయంతో వంట సరుకులు తెప్పించుకుంటాను. పాక్కుంటూ వెళ్లి ఎలాగోలా వంట చేసుకుంటాను. పెరిగిన పింఛనే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో.. అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు.. ఈ ప్రభుత్వం అడగకుండానే మాలాంటోళ్లకు మేలు చేస్తోంది. – తలారి కదిరప్ప, బండపల్లె (సిద్దల కోదండరామిరెడ్డి, విలేకరి, కురబలకోట)
నా పొలం సస్యశ్యామలం
మాది పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం మరుపెంట గ్రామం. మాకు కొద్దిపాటి సాగు భూమి ఉంది. దాంట్లో వ్యవసాయం చేసేందుకు సాగునీటికి ఇబ్బందిగా ఉండేది. మా పొలానికి గతంలో తోటపల్లి రెగ్యులేటర్ ద్వారా సాగునీరు అందేది. నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు బాగా కురిస్తేనే మా పంటలకు సాగునీరు అందేది. నీటి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో పంట సాగు దైవాదీనంగా మారింది. సాగుకోసం చేసిన అప్పు తీర్చలేక సతమతం అయ్యేవాళ్లం. ఆ సమయంలో నాకున్న ఇద్దరు మగపిల్లల చదువు కూడా కష్టతరంగా మారింది.
కానీ వైఎస్సార్ తోటపల్లి ప్రాజెక్టును నిర్మించి ఇబ్బంది లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కాలువలు నిర్మించి ఆ నీటిని పొలాలకు అందిస్తోంది. ఫలితంగా నీరు పుష్కలంగా పంట పొలాలకు అందుతోంది. ఈ ప్రభుత్వం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు అధిక ప్రాధాన్యమిస్తుండడంతో సాగునీటి కష్టాలు గట్టెక్కుతున్నాయి. ఇప్పుడు మా ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతోంది. ఖరీఫ్‌లో వరి, రబీలో ఆరుతడి పంటలు, అపరాలు వేసుకుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాం. – గంట శంకరరావు, మరుపెంట (దత్తి మహందాత నాయుడు, విలేకరి, పార్వతీపురం)
Comments
Please login to add a commentAdd a comment