సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఉదయం విశాఖ అర్బన్, మధ్యాహ్నం విశాఖ రూరల్ నియోజకవర్గాల సమావేశాలను నాగబాబు నిర్వహించారు.
కాగా, మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌పై ఆ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా చేయి చేసుకున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. యలమంచిలిలో పార్టీ ఇన్‌చార్జి అయిన తనను కాదని.. ఏడాదిక్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కట్టెంపుడు సతీష్‌ను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతూ శివశంకర్‌తో సుందరపు విజయ్‌కుమార్ మొదట వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్‌కుమార్ ఏకంగా శివశంకర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఉదయం జరిగిన అర్బన్ సమావేశంలోనూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వెంకటలక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణ మండిపడినట్టు తెలుస్తోంది. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తంగా సమావేశం ముగించుకుని నాగబాబు వెళ్లిన వెంటనే పార్టీ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ ఘటనలు జనసేన పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాయి.
ఇది కూడా చదవండి: చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment