కశింకోట (అనకాపల్లి)/విశాఖ జిల్లా: పంచదార చిలుకలు తీపిని పంచుతాయి. పిల్లలు మొదలుకొని పెద్దలను సైతం ఆకర్షిస్తాయి. ఆత్మీయత, అభిమానాన్ని పంచుతాయి. పంచదార చిలుకలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు, తీర్థాలు జరగవనే చెప్పాలి. కొందరు వివాహాలు, ఉపనయనాలలో కూడా వీటిని సంప్రదాయంగా సారె గాను, బంధువర్గానికి పంపిణీకి వినియోగిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పంచదార చిలుకల తయారీకి మండల కేంద్రం కశింకోట ప్రసిద్ధి. ఇక్కడి వడ్డి వీధిలో ఏళ్ల తరబడి పంచదార చిలుకల తయారీయే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.
వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన వడ్డెర కులానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పంచదార చిలుకలను తయారు చేసి జీవనం సాగించేవారు. అయితే ఆధునికంగా రంగుల స్వీట్లు ప్రవేశించడంతో వీటికి క్రమేపి ఆదరణ తగ్గింది. దీంతో కొంతమంది పత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాల వారు మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. తమ తాతల కాలం నుంచి కొనసాగిస్తున్న వృత్తిని మానుకోలేక, మరో పని చేతకాక ఇదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తయారీదారులు పేర్కొంటున్నారు.
జిల్లాలోని బుచ్చియ్యపేట మండలం వడ్డాది, యలమంచిలి మండలం కొప్పాక, పాయకరావుపేట, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా వీటిని తయారు చేస్తారు. ప్రధానంగా సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు, తీర్థాల్లో వీటికి గిరాకీ ఉంటుంది. దీంతో ఉత్సవాలకు ముందు వీటిని తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి, ఆ తర్వాత జిల్లాలో జరిగే తీర్థాలు, ఉత్సవాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. పంచదార చిలుకలను ఆకర్షణకు వివిధ రకాలుగా తయారు చేస్తారు. తాజ్‌మహాల్, పన్నీరు బుడ్డీ, ఆలయ గోపురాలు తదితర ఆకారాల్లో తయారు చేస్తారు. వీటిలో ఎక్కువగా రామచిలుకల ఆకారంలోనే తయారు చేస్తారు. రూ.10 నుంచి వంద రూపాయల వరకు వీటిని విక్రయిస్తారు.
పంచదార చిలుకల తయారీలో నిమగ్నం
చిలుకల తయారీ...
చిలుకల తయారీకి ఎక్కువ సరుకులు అవసరం లేదు. పంచదార, ఆకర్షణకు రంగు ఉంటే చాలు. పంచదారను సరిపడిన నీరు పోసి పాకం వచ్చే వరకు మరిగించాలి. ఆకర్షణ కోసం రంగు వేసి పాకాన్ని ముందుగా చెక్కలతో తయారు చేసిన కావలసిన పరిమాణం, ఆకారంలో ఉన్న అచ్చుల్లో పోస్తారు. కొంతసేపు అచ్చుల్లోనే ఆరిన తర్వాత అచ్చుల నుంచి బయటకు తీసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. కిలో చిలుకల తయారీకి రూ.85 ఖర్చు అవుతుంది. దీనిలో పంచదార, రంగు, కట్టెలు లేదా గ్యాస్ ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. పాకం సరిగా లేకపోతే చిలుకలు తయారు కావు. ముక్కలు అవుతాయి. దీంతో వాటిని మళ్లి మరిగించి పాకం సిద్ధం చేసి చిలుకలు తయారు చేయవలసి వస్తుంది. దీనివల్ల తరుగు ఏర్పడి పాకం తగ్గిపోయి నష్టం వస్తుంది.
సంక్రాంతి స్పెషల్ చిలకలు
సంక్రాంతి సంబరాలు, తీర్థాల రోజుల్లోనే పంచదార చిలుకలను తయారు చేస్తాం. కిలో చిలుకల తయారీకి రూ.85 అవుతుంది. జిల్లాలో జరిగే ఉత్సవాలు, తీర్థాలకు తీసుకెళ్లి విక్రయిస్తాం. ఖర్చులు పోనూ రూ.40 వరకు మిగులుతుంది. సంక్రాంతి రోజుల్లోనే తమకు ఆదాయం సమకూరుతుంది. మిగిలిన రోజుల్లో ప్రత్యామ్నాయం పనులు వెతుక్కొవలసి వస్తోంది.
–శ్రీకాకుళపు కుమార్, పంచదార చిలుకల తయారీదారు, కశింకోట.
Comments
Please login to add a commentAdd a comment