AP High Court Key Comments On Employees Salaries Over State Finanical Condition - Sakshi
Sakshi News home page

Andhra Pradesh High Court: ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు జీతాలు తగ్గించొచ్చు

Published Tue, Jan 25 2022 2:30 AM | Last Updated on Tue, Jan 25 2022 1:12 PM

Key Comments Of High Court bench addressing employees salaries - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించవచ్చని హైకోర్టు తెలిపింది. జీతాలు తగ్గించకూడదని ఎక్కడా లేదని, అది యజమాని (రాష్ట్ర ప్రభుత్వం) సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం ఆదాయాలు, బడ్జెట్‌ కేటాయింపులు తదితరాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జీతాలు తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా వాటి సర్దుబాటు పరిపాటి అని, ఎక్కువ జీతాలు ఇచ్చిన చోట రికవరీ చేస్తామని అంటే మీరెలా అభ్యంతరం చెబుతారని ఉద్యోగులను ప్రశ్నించింది.

శాతాల ఆధారంగా కాకుండా వాస్తవ రూపంలో (నగదు) ఎంత పొందుతున్నారో లెక్కలు వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇది సర్వీసు వివాదమైనందున, రోస్టర్‌ ప్రకారం తాము విచారణ జరపడం సమంజసం కాదని చెప్పింది. సీజేను సంప్రదించి ఈ వ్యాజ్యాన్ని తగిన బెంచ్‌ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి.శ్రీభానుమతి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణతో జారీ చేసిన జీవో 1పై ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణ్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.

కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులే..
పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఎక్కువ జీతాలు చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే జీతాలు తగ్గించవచ్చునని చెప్పింది. కొత్త వేతన సవరణ వల్ల జీతం ఏ రకంగా తగ్గిందో చెప్పాలని కోరింది. మీరు శాతాల్లో తగ్గిందంటున్నారు. శాతం తగ్గినంత మాత్రాన మీ వాస్తవ చెల్లింపులు పెరిగి ఉంటే, తగ్గిందని ఎలా అంటారు? కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులు మాత్రమే.’ అని తేల్చి చెప్పింది.

సమ్మె పేరుతో బెదిరిస్తున్నారు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ తక్కువ చేయలేదు. పీఆర్‌సీ నివేదికను కార్యదర్శుల కమిటీ అందరికీ అందుబాటులో ఉంచింది. ఉద్యోగ సంఘాలతో 9 సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి సమక్షంలో ఓసారి జరిగాయి. సిఫారసులు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఉద్యోగ సంఘం నేతకూ తెలుసు. ప్రభుత్వం తన ఉద్యోగుల నుంచే సమ్మె బెదిరింపును ఎదుర్కొంటోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తామంటున్నారు. కోర్టు జోక్యాన్ని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు జరపలేరా? ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోరారు. వారు చర్చలకు రాకుండా 3 గంటలకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు వస్తామని చెబుతున్నారు’ అని వివరించారు.

రెవెన్యూ రూ.60 వేల కోట్లకే పరిమితం
‘ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62కు పెంచాం. గ్రాట్యుటీ రూ.16 లక్షలకు పెంచాం. ప్లాట్ల కేటాయింపులో ఉద్యోగులకు 20 శాతం రిబేటు ఇచ్చాం. వీటన్నింటినీ ఓ ప్యాకేజీ కింద ఇచ్చాం. కొత్త పీఆర్‌సీ వల్ల ప్రభుత్వంపై రూ.10,825 కోట్ల భారం పడుతుంది. అయినా వారి కోసం భరిస్తున్నాం. అదీ కోవిడ్‌ పరిస్థితుల్లో. కోవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయింది. 2018–19 సంవత్సరంలో రూ.62,473 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రెవెన్యూ 2019–20కి రూ.60,933 కోట్లకు, 2020–21కి రూ.60,688 కోట్లకు పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో 15 శాతం వృద్ధితో రెవెన్యూ రూ.75 వేల కోట్లకు చేరాలి.

అందుకు భిన్నంగా రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2018–19లో జీతాల చెల్లింపులు రూ.52 వేల కోట్లుగా ఉంటే, 2021–22 నాటికి రూ.67 వేల కోట్లకు చేరింది. ఇవన్నీ ఉద్యోగులకు తెలుసు’ అని శ్రీరామ్‌ వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. 3 గంటలకు అంటున్నారు కాబట్టి, మధ్యాహ్నం 2.15కు మా ముందుకు రావాలని ఆ ప్రతినిధి బృందానికి చెప్పాలని అంది. ఆ బృందంలో కొందరు సీఎస్‌ వద్దకు వెళ్లొచ్చని, కొందరు వర్చువల్‌ విధానంలో మా ముందుకు రావాలని తెలిపింది. 12 మంది వచ్చినా కూడా అభ్యంతరం లేదంది. ఈ వ్యవహారాన్ని వివాదంగా చూడొద్దంది. ఇరుపక్షాల మధ్య ఇగో అవసరం లేదని  ధర్మాసనం తెలిపింది.

సమయం వృథా చేసినందుకు క్షమించండి
భోజన విరామం తరువాత ధర్మాసనం స్పందిస్తూ, ‘మేం బెంచ్‌ దిగిపోయిన తరువాత మాకో సందేహం వచ్చింది. ఇది పిల్‌ కాదు. పునర్విభజన చట్ట వివాదం కూడా కాదు. సర్వీస్‌ వివాదం అవుతుంది. సర్వీసు వివాదంపై మా బెంచ్‌ ఎలా విచారిస్తుంది అన్న సందేహం వచ్చింది. దీనిపై రిజిస్ట్రీ నుంచి కూడా స్పష్టత కోరాం. ఈ వ్యాజ్యంపై రోస్టర్‌ ప్రకారం మేం విచారించడం సబబు కాదు. ఈ విషయం తెలియక సమయం వృథా చేశాం. ఇందుకు అందరూ క్షమించాలి’ అని కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement