అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై అమ్మకాలు
కొండపల్లి కొయ్య బొమ్మ ఒక్కసారి మన ఇంట్లోని షోకేస్‌లో చేరిందంటే.. ఎన్ని తరాలైనా అక్కడే కోటకట్టుకుని కూచుండిపోతుంది. అమ్మకు చిన్నప్పుడు జాతరలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి.. అబ్బాయి’ బొమ్మ నుంచి మొదలై.. అన్నయ్య ముచ్చటపడి కొనిపించుకున్న ఎడ్లబండి బొమ్మ.. అక్క కొనుక్కున్న తలాడించే బుట్ట»ొమ్మ.. నాన్నమ్మ భక్తిభావంతో కొనుక్కొచ్చిన దశావతారాల బొమ్మ ఒకదాని పక్కన మరొకటి చేరిపోతుంటాయి. ఎంతకాలమైనా చెక్కుచెదరకుండా తమ అందాలతో అలరిస్తుంటాయి.
సాక్షి, అమరావతి: కొండపల్లి కొయ్య బొమ్మలు పురాణాల నేపథ్యం.. గ్రామీణ జీవితం.. జంతువుల రూపంలో సంతోషకరమైన వాస్తవిక వ్యక్తీకరణలను ప్రదర్శిస్తాయి. మెత్తటి కలప.. గింజలు.. పండ్ల తొక్కల నుంచి తీసిన రంగులతో ఆ బొమ్మలు అందాలను అద్దుకుంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఆ బొమ్మల్ని ఒకరిపై ఒకరు విసురుకున్నా దెబ్బలు తగలవు. చంటి పిల్లలు ఆ బొమ్మల్ని నోట్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. వీటినే కొండపల్లి కొయ్య బొమ్మలంటారు.
ఇప్పుడు ఈ బొమ్మలు కూడా ఆన్‌లైన్ మెట్లెక్కి అదుర్స్ అనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఏటా రూ.3 కోట్ల విలువైన కొండపల్లి బొమ్మల విక్రయాలు జరుగుతుండగా.. ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ అమ్మకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి ఈ–కామర్స్ సంస్థలు ఏటా రూ.15 లక్షల విలువైన బొమ్మల్ని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి.
వీటి ధర కనిష్టంగా రూ.70 నుంచి గరిష్టంగా రూ.5 వేల వరకు పలుకుతున్నాయి. భౌగోళిక గుర్తింపు(జీఐ)ను పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి దేశవ్యాప్తమైంది. విజయవాడ సమీపంలోని కొండపల్లిలో ఇప్పటికీ దాదాపు 200 మంది హస్తకళాకారులకు ఇదే జీవనాధారం.
రాజస్థాన్ నుంచి వలస వచ్చి..
రాజస్థాన్ నుంచి 400 ఏళ్ల క్రితం సంప్రదాయ హస్త కళాకారులు కొండపల్లికి వలస వచ్చారు. అక్కడే స్థిరపడిన వారిని ఆర్యకుల క్షత్రియులుగా పిలుస్తారు. వీరు మొదట్లో అనేక ఆలయాల్లో గరుడ, నంది, సింహ వాహనాల వంటి విగ్రహాలను చెక్కినట్టు చెప్తారు. కాలక్రమంలో కొయ్య బొమ్మలు, ఆట బొమ్మలు, అలంకరణ బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టారని చెబుతారు.
అతి తేలికైన తెల్ల పొణికి చెక్కలను సేకరించి వివిధ ఆకృతుల్లో బొమ్మల తయారీని వారు జీవనోపాధిగా ఎంచుకున్నారు. తెల్ల పొణికి కర్రను చెక్కి దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నిమ్మ జిగురు పూతతో చింతపండు గింజలు, ఇతర చిన్నపాటి వస్తువులను అతికి బొమ్మల్ని రూపుదిద్దుతారు. వాటికి కూరగాయల నుంచి సేకరించిన సహజ సిద్ధౖమెన రంగులు, పొడి రంగులు, ఆయిల్ పెయింట్‌లు అద్దుతారు. ఆ బొమ్మల జుట్టుగా మేక వెంట్రుకలను అతికించి తీర్చిదిద్దుతారు.
గ్రామీణ వాతావరణం.. స్పష్టమైన వ్యక్తీకరణం
కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు గ్రామీణ వాతావరణానికి అద్దం పడతాయి. జంతువుల నుంచి మనుషుల బొమ్మల వరకు ప్రతీ దాని మొహంలోనూ స్పష్టమైన వ్యక్తీకరణ తొణికిసలాడుతుంది. జంతువులు, వృత్తులు, రోజువారీ మనిషి జీవితం నుంచి పౌరాణిక పాత్రలు సైతం వీరి చేతిలో ఆకృతి దాల్చుతాయి.
దశావతారాలకు ప్రాచుర్యం
కళాత్మకమైన పనితనానికి కొండపల్లి కొయ్య బొమ్మలు గుర్తింపు పొందాయి. తాడిచెట్టు, ఎడ్లబండి, అంబారీ ఏనుగు, గ్రామీణ నేపథ్యంలోని బొమ్మలు, బృందావనం బొమ్మలకు భలే క్రేజ్ ఉంటుంది. వీరు తయారు చేసిన బొమ్మల్లో దశావతారాల బొమ్మలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. గీతోపదేశం, పెళ్లికూతురు–పెళ్లికొడుకును మోస్తూ వెళ్తున్న పల్లకీ–బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువుల బొమ్మలకు డిమాండ్ ఉంది. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు.
Comments
Please login to add a commentAdd a comment