సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆమంచర్లలో గ్రామస్తులు, కార్యకర్తలు, పార్టీ నేతలను కలిసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రకటించక ముందే ఏప్రిల్ 11 నుంచి ‘జగన్న మాట గడప గడపకు శ్రీధరన్న బాట’ అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, కలిసి భోజనం చేయడం, అక్కడే నిద్రించడం, తర్వాత రోజు మళ్లి కొనసాగించడం ఇలా నిరంతరాయంగా కొనసాగించారు. నెల రోజుల తర్వాత ఉప్పుటూరులో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కాలికండరాలు పట్టుకొని నడవలేని స్థితిలో అస్వస్థతకు గురయ్యారు. పరీక్షించిన వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని గ్రామాల్లో బస లేకుండా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు.
తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 47వ రోజు శుక్రవారం ఆమంచర్లలోకి ప్రవేశించారు. ఉదయం గ్రామస్తుల ఇళ్లకు వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. అక్కడే ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో అందరికీ దగ్గరుండి వడ్డించారు. అరుంధతీయుడు దర్శిగుంట చిన్నయ్యతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి చేరుకుని సేద తీరుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శరీరం చెమటతో తడిసి పోయింది. వెంటనే తేరుకున్న ఆయన సతీమణి సుజిత సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరే సమయంలో పల్స్ రేటు 160/170 ఉండడంతో ఒక దశలో వైద్యులు హైరానా చెందారు. ప్రాథమిక చికిత్స అనంతరం పల్స్ కంట్రోల్ అయ్యాక చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాపాయం తప్పింది
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ప్రాణాపాయం తప్పిందని అపోలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీమణి, తెలిపారు. ఆస్పత్రికి చేరే సమయంలో సాధారణ స్థితి కంటే హార్ట్ రేట్ బాగా పెరిగి బీపీ తగ్గింది. ట్రీట్‌మెంట్ తర్వాత కండీషన్ సాధారణ స్థితికి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి రెఫర్ చేశాం. రెండు వారాల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ మేరకు విశ్రాంతి లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది.
పరామర్శించిన మంత్రి కాకాణి
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని హటాహుటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అపోలో ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. ఆరోగ్యంపై వైద్యులతో, ఎమ్మెల్యే సోదరుడు రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో చర్చించి చెన్నై అపోలో ఆస్పత్రికి వెంటిలేటర్ అంబులెన్స్‌లో తరలించారు. ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీ కేడర్ పెద్ద ఎత్తున అపోలో అస్పత్రికి తరలివచ్చారు.
సజ్జల, విజయసాయిరెడ్డి పరామర్శ
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి ఫోన్ చేసి యోగక్షేమాలను తెలుసుకున్నారు. సత్వర వైద్య సేవలు అందించాలని ఎలాంటి అవసరమొచ్చిన తక్షణమే తెలపాలని కోరారు. ఒంగోలు, నెల్లూరు రీజనల్ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైద్యులతో చర్చించి గిరిధర్‌రెడ్డిని ఫోన్ పరామర్శించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై ఆస్పత్రికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ బర్త్‌డే విషెస్
Comments
Please login to add a commentAdd a comment