సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలను కేటాయిస్తూ ఆ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోపై విచారణ తమ పరిధిలోకి రాదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తేల్చి చెప్పింది. ఈ జీవోపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ (ఐఏ)ను బుధవారం కొట్టివేసింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ సర్కారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల వాటా తమకే దక్కుతుందని ఏకపక్షంగా తీర్మానించుకుని మొత్తం 90 టీఎంసీలను ఆ ఎత్తిపోతలకు కేటాయించుకుంటూ 2022 ఆగస్టు 18న తెలంగాణ ప్రభుత్వం జీవో 105 జారీ చేసింది.
కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను నాగార్జునసాగర్‌కు ఎగువన కృష్ణా నదిలో 45 టీఎంసీలను అదనంగా వాడుకునే వెసులుబాటును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చింది. విభజన నేపథ్యంలో ఆ 45 టీఎంసీలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని, చిన్న నీటి వనరుల విభాగంలో కేటాయింపులకంటే తెలంగాణ అధికంగా వాడుకుంటున్నందున, జీవో 105ను రద్దు చేయాలంటూ కేడబ్ల్యూడీటీ–2లో గతేడాది ఏపీ ప్రభుత్వం ఐఏ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ బ్రిజేష్కుమార్ అధ్యక్షతన జస్టిస్ ఎస్.తాళపత్ర, జస్టిస్ రామ్‌మోహన్‌రెడ్డి సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2 పలుమార్లు విచారించి, బుధవారం తుది తీర్పు ఇచ్చింది. విభజన చట్టంలో సెక్షన్–89(ఏ) ప్రకారం అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ నీటిని కేటాయించని ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేయడం తమ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను విభజన చట్టం అమల్లోకి వ చ్చిన తర్వాత తెలంగాణ చేపట్టిందని తెలిపింది. అందువల్ల ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై విచారణ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment