కృత్తివెంటి పేర్రాజు పంతులు స్థాపించిన పాఠశాల
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): స్థల మహిమో.. వ్యవస్థాపకుల సంకల్ప బలమో కానీ కొన్ని పాఠశాలలు నిజమైన సరస్వతీ నిలయాలుగా వెలుగొందుతాయి. ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు వామనుల్లా ఇంతింతై వటుడింతయై అన్నట్టు ప్రజ్ఞలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అది ఎంత ఎత్తంటే వారు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేంతలా. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యం మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే కదా. అలాంటి ‘ఉన్నత’మైనదే కృత్తివెంటి పాఠశాల. శనివారం 116వ వార్షికోత్సవం జరుపుకొంటోంది.
పాఠశాల ప్రస్థానం ఇదీ..
కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు కృత్తివెంటి పేర్రాజు 1852లో కాకినాడలో జన్మించారు. న్యాయవాది అయిన ఆయన ఓ కేసు నిమిత్తం రామచంద్రపురం వచ్చి కక్షిదారులైన ఇద్దరు అన్నదమ్ముల నిరక్ష్యరాస్యతను చూసి కలవరపడ్డారు. తిరుగుప్రయాణంలో బంట్రోతుతో కృత్తివెంటి ‘కాటన్ దొర ఆనకట్టకట్టారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ.. దానితో సమానంగా వీరి బుర్రలు మాత్రం పెరగటంలేదు. విద్యలేని విత్తం అనర్థదాయకం.. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’ అన్నారట.
ఆయన అభీష్టం మేరకు 1905లో 4 నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేసేందుకు పాఠశాల స్థాపించి జాతీయ పాఠశాలగా నామకరణం చేశారు. 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. అందుకోసం పేర్రాజు పంతులు 94.21 ఎకరాలను దానం చేసి పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యానవన పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు ఆయన దానం చేసిన స్థలంలో అంకురార్పణ జరిగింది. నియోజకవర్గానికి చెందిన మొట్టమొదటి మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించి భవన, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
మరెందరో విద్యాభాస్యం
వందేళ్లు పైబడి పాఠాలు నేర్పిన ఈ సరస్వతీ నిలయం మరెందరినో ఎన్నో రంగాలలో తీర్చిదిద్దింది. భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాలనే అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ పాఠశాలలో 6వ తరగతి చదివారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళికథ ఫేం), మాష్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ యాక్టర్ రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రహ దర్శకుడు చోటా కే నాయుడు, మెజీషియన్ వి.పట్టాభిరామ్, రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకుడు, కవి, అదృష్టదీపక్, వీణావాదనలో దిట్ట ద్విభాష్యం నగేష్‌బాబు, వీరే కాకుండా రాజగోపాలనరసరావు, రాజబహదుర్ రామచంద్రరాజు, నందివాడ సత్యనారాయణరావు వంటి మహామహులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment