ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంస్మరణ సభలో కొందరు వక్తలు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వపరంగా ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా సంస్మరణ సభలు నిర్వహించవచ్చా అన్న చర్చ ఒకటి అయితే, కీరవాణి వంటి సినీ ప్రముఖులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురి అవుతున్నాయి.
కీరవాణి కులగజ్జితోనో, పార్టీ గజ్జితోనో మాట్లాడారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన మామ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.ను,రామోజీరావును సమానం చేస్తూ రాజగురువు పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనాడు మీడియా నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తుందని అంటూ గత ప్రభుత్వం ఓడిపోయిందన్న వార్త విన్న తర్వాతే రామోజీ కన్నుమూశారని చెప్పారు. ఈ విషయాన్ని బట్టే రామోజీ పక్షపాతంగా పనిచేశారా?లేక నిష్పక్షపాతంగా పనిచేశారా అన్నది పవన్ చెప్పకనే చెప్పారనుకోవచ్చు.
చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు రాజకీయ నేతలు కనుక, ఈనాడు మీడియాతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలి కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని కీరవాణి చేసిన రాజకీయ విమర్శ అర్ధరహితంగా ఉందని చెప్పవచ్చు.సంస్మరణ సభ కనుక రామోజీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం తప్పు కాదు. ఆయనను బాగా పొగడడం అభ్యంతరం కాదు. కాని అంతటితో ఆయన ఆగలేదు. రామోజీ ఏపీని ఎంతో ప్రేమిస్తారట.అలాంటి ఏపీ కబంధ హస్తాల నుంచి బయటపడిన తర్వాతే నిష్క్రమించారని ఆయన తెలిపారు . ఇది దుర్మార్గమైన కామెంట్. రామోజీ నిజంగానే ఏపీని ప్రేమించి ఉంటే అదెలాగో చెప్పి ఉండాల్సింది.
ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కబంద హస్తాలలో ఉండి ఉంటే ఏ రకంగానో వివరించాలి కదా! పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తే అది కబంద హస్తం అవుతుందా?ప్రభుత్వ స్కూళ్లను ,ఆస్పత్రులను బాగు చేయడం, ప్రజల ఇళ్లవద్దకే పాలనను తీసుకు వెళ్లడం, వృద్దుల ఇళ్లవద్దే పెన్షన్ లు అందచేయడం, చెప్పిన హామీలు చెప్పినట్లు నెరవేర్చడం, కిడ్నీ బాదితుల కోసం ఉద్దానంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ఒక భారీ రక్షిత నీటి పధకం తీసుకు వస్తే అది కబంధ హస్తమా!రాజకీయాలలో గెలుపు,ఓటములు ఉంటాయి.
ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే కీరవాణి అభిమానించే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా మూడుసార్లు ఓడిపోయింది. అప్పుడు కూడా ఏపీ కబంద హస్తం నుంచి బయటపడినట్లు అవుతుందా!చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు తగ్గిస్తానని ,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు.అది ఏపీ ప్రజలకు ఇచ్చిన అభయహస్తమని కీరవాణి భావిస్తున్నారా!జగన్ అమలు చేసిన వాగ్దానాలకన్నా మూడు రెట్లు అధికంగా ప్రజలకు డబ్బు పంచుతానని టిడిపి మానిఫెస్టోలో ప్రకటించింది.
అప్పుడు అది కబంధ హస్తం అవుతుందా?లేక అభయహస్తం అవుతుందా?మద్యం ధర తగ్గించి, సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి ప్రజలను దోపిడీ చేయడానికి బడా సినిమా నిర్మాతలకు అవకాశం ఇవ్వడం ఏపీకి అభయహస్తం ఇచ్చినట్లవుతుందని కీరవాణి అనుకుంటుండవచ్చు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయడం, కనీసం ముప్పైశాతం షూటింగ్‌లు చేయాలని జగన్ కోరితే అది కబంద హస్తం అన్నమాట.రామోజీకి నిజంగానే ఏపీపై అంత ప్రేమ ఉంటే ఫిలిం సిటీ వంటివాటిని ఏపీలో ఎందుకు పెట్టలేకపోయారు!
ఆ రాష్ట్రంలో గత పదేళ్లలో ఆయన పెట్టిన సంస్థలు ఏమి ఉన్నాయి?పోనీ అంతకుముందు అయినా ఏపీ ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఏమిటి?తుపాను వంటివి వచ్చినప్పుడు విరాళాలు సేకరించి కొన్నిచోట్ల ఒక వంద ఇళ్లు నిర్మించి ఉండవచ్చు. అది తప్ప మిగిలినదంతా ఆయన చేసింది వ్యాపారమే కదా!అంతవరకు ఆయన గొప్పవాడే అని చెప్పండి. కాని ఏపీని ఆయనే ఉద్దరించినట్లు కలరింగ్ ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది.
మార్గదర్శి సంస్థల ద్వారా సేకరించిన డబ్బు తీసుకువెళ్లి తెలంగాణలో రామోజీ ఫిలింసిటీని, టీవీ కార్యాలయాలను నెలకొల్పారు కాని, ఏపీలో ఏమైనా పెట్టుబడి పెట్టారా!ఈనాడు మీడియా ద్వారా అబద్దాల ప్యాక్టరీని పెట్టి నిత్యం తనకు గిట్టని వారిపై విషం చిమ్మడం విలువలకు ప్రాధాన్యం ఇచ్చినట్లా!సినిమా రంగానికి చెందిన దాసరి నారాయణరావు పేరు కూడా లేకుండా ఆయన సినిమాలను టీవీలలో చూపించడం గొప్ప విషయమా?రామోజీ ఒక వ్యక్తిగా,తన వ్యాపార రంగంలో అభివృద్ది చెందారు.దానిని ఎవరు కాదనరు.కాని దాంతోనే ఏపీ సమాజం అంతటికి ఆయనే ఆదర్శమన్నట్లు చిత్రీకరించడం కరెక్టు కాదు.
ఏపీ సమాజానికి ఆయన ఏమి ఇచ్చారో కాని,ఆ సమాజం నుంచి ఆయన చాలా పొందారు. ఎంత మేలు చేశారోకాని, హానీ మాత్రం బాగా ఎక్కువగానే చేశారు. మీడియా లేకుండా కేవలం ఇతర వ్యాపారాలకే రామోజీ పరిమితం అయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వపరంగా ఇంత భారీ సభ నడిపేవారా?కీరవాణి ఇంతగా పొగిడేవారా!ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా పేరొందిన హరిశ్చంద్రప్రసాద్ వంటివారికి గాని, దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు ,ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులకు కాని ఇవ్వనంతగా గౌరవం ఇచ్చారంటే కేవలం మీడియా ద్వారా ప్రభావితం చేయడం కాదా! తెలుగుదేశం పార్టీకి, అందులోను చంద్రబాబు నాయుడుకు బాజాలు కొట్టినందుకు కాదా! కీరవాణి వంటి వారికి సినిమా వ్యాపారంలో రామోజీ అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు.
అంతవరకు అభినందించడం, కృతజ్ఞతలు చెప్పడం మంచిదే.అలాకాకుండా జగన్ ప్రభుత్వంపై పిచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా కీరవాణి కులగజ్జితోనే మాట్లాడుతున్నారని రుజువు చేసుకున్నట్లు కాదా!ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి,నిజాయితీల కోసం రామోజీ బతికారని చెప్పారు. మార్గదర్శిపై ఎన్నో కేసులు పెట్టారని ,ఎన్నో రకాలు గా హింసించారని ఆయన అన్నారు. రామోజీ తన పత్రిక, టీవి ద్వారా చాలామందిని అంతకన్నా ఎక్కువగా హింసించారు. అవన్ని ఎందుకు! మార్గదర్శి ద్వారా డిపాజిట్లు వసూలు చేయవచ్చా?అందులో నల్లధనం పెద్ద ఎత్తున ఉందని వచ్చిన అభియోగాలపై ఎందుకు రామోజీ తన జీవిత కాలంలో వివరణ ఇవ్వలేకపోయారు?
రామోజీరావు ,ఎన్.టి.ఆర్.లను సమానం చేసే విదంగా చంద్రబాబు మాట్లాడడం ద్వారా తనకు రాజగురువుపై ఉన్న భక్తిని తేటతెల్లం చేశారని అనుకోవచ్చు.అంతవరకుతప్పుపట్టనవసరం లేదేమో! చంద్రబాబు ఒక ఆసక్తికర విషయం తెలియచేశారు.' కొన్ని పత్రికలలో ఇతర పార్టీల వార్తలు రాయరని, కాని రామోజీ మాత్రం ప్రతి పార్టీ,నాయయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ,ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇస్తారని, కవరేజీలో ఎక్కడ తప్పు చేయరు అని అన్నారు. తన అభిప్రాయాలను ఎడిటోరియల్ పేజీలో చెబుతారని" కూడా పేర్కొన్నారు.
నిజంగానే ఇలా జరిగిందా అని చూస్తే నేతిబీరకాయలో నెయ్యి చందమే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి వార్తలు ఇవ్వాలనే వారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అవేమీ పాటించలేదు.గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఉంటే, విపక్ష టిడిపికి 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఈ కాలంలో ఈనాడు మీడియా ఇచ్చిన కవరేజీని గమనిస్తే చంద్రబాబు ఈ విసయంలో కూడా అసత్యాలు చెప్పారని అర్దం అవుతుంది. టిడిపి కి డెబ్బైఐదుశాతం వార్తల కవరేజీ ఇస్తే,వైఎస్సార్‌సీపీకి పాతిక శాతం కూడా ఇవ్వలేదు.వైఎస్సార్‌సీపీ వ్యతిరేక వార్తలు మాత్రం డెబ్బై ఐదు శాతం ఇచ్చారు.అంతేకాదు.
గత ఐదేళ్లు వార్తలకు,సంపాదకీయాలకు తేడా లేకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కధనాలను,పచ్చి అబద్దాలను మొదటిపేజీలో ఇచ్చారో అందరికి తెలుసు. రామోజీరావు అంటే నాకు గౌరవమే.ఆయన వద్ద పనిచేసిన అభిమానం ఉంటుంది.కాని ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే ఇప్పుడు వాస్తవాలు చెప్పవలసి వస్తోంది.చివరిగా ఒక మాట.కీరవాణి తన ప్రసంగంలో రామోజీరావును భీష్ముడితో పోల్చారు. అంటే భీష్ముడు మాదిరి కౌరవుల తరపునే రామోజీ యుద్దం చేశారని చెప్పినట్లే కదా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment