సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి విపణి వరకు రైతులకు అండగా నిలిచేందుకు గ్రామస్థాయిలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ఏర్పాటు చేశాం. రైతు ముంగిట (ఫామ్‌గేట్) పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వారు పండించిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచాం. గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83 వేల కోట్ల సాయమందించాం. పొరుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నాయి.
మీరు కూడా ఒక్కసారి మా రాష్ట్రానికి వచ్చి చూడండి.. రైతుల కోసం మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తుందో అర్థమవుతుంది. కేంద్రం నుంచి మీరు ఇతోధికంగా సాయమందిస్తే రైతుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు తోడ్పడుతుంది..’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన జాతీయస్థాయి వర్చువల్ సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున మంత్రి కన్నబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్‌బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించే ప్రతి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఆర్‌బీకే స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టింగ్ సెంటర్లతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. కొనుగోలు చేసే ఉత్పత్తుల కోసం గ్రామస్థాయిలోనే రూ.1,534.75 కోట్లతో 2,543 గోదాములతోపాటు మరో రూ.269 కోట్లతో వివిధరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
వీటికి సంబంధించి టెండర్లు తుదిదశలో ఉన్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగు, దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా రైతులకు ఆర్థిక చేయూతనిస్తున్నట్లు తెలిపారు. రూ.80 కోట్లకుపైగా ఇన్సెంటివ్ రూపంలో అందించామన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణ కోసం కేంద్రం ప్రకటించిన పాలసీ చాలా బాగుందన్నారు. అది తమ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ‘ఒక్కసారి మా రాష్ట్రానికి రండి.. మా ప్రభుత్వానికి చేయూతనివ్వండి..’ అని మంత్రి కన్నబాబు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
మా ‘భరోసా’కు తోడు మీ సాయం కావాలి
Published Wed, Sep 8 2021 3:50 AM | Last Updated on Wed, Sep 8 2021 3:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment