
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం’ కింద చేపట్టిన భూ రీసర్వే పనులకు సంబంధించిన టెండర్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు సమర్పించినట్లు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. డ్రోన్లు, ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా సర్వే చేసేందుకు అవసరమైన పరికరాల కోసం ఈ టెండర్లను పిలుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్ని రకాల భూములను, వాటి విస్తీర్ణ ప్రాంతాలను హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో డ్రోన్లు, కార్స్ నెట్‌వర్క్, జీఎన్‌ఎస్‌ఎస్ రిసీవర్లతో రీసర్వే చేస్తామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు, ఆసక్తి కలిగిన బిడ్డర్లు, సాధారణ ప్రజలకు వీటికి సంబంధించి సూచనలు, సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు సెప్టెంబర్ 7వ తేదీలోపు సమర్పించాలని కోరారు.