భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా భూముల రీ సర్వేను మూడు ఫేజ్‌ల్లో చేపట్టగా ఫేజ్ 1లో 98 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. అందులో పైలెట్ ప్రాజెక్టుగా 16 మండలాల్లోని 16 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఉండే వ్యవసాయ, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ను రీ సర్వే చేసి నూతన రికార్డుల్లో పొందుపరిచారు. సర్వే పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 23న ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో సర్వేపూర్తి చేసిన 16 గ్రామాలల్లో కూడా భూ పత్రాల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పత్రాల్ని అందిస్తారు. 16 గ్రామాలకు కలిపి మొత్తం 6,187 మంది రైతుల 5,656 పత్రాలు పంపిణీ చేస్తారు.
98 ఏళ్ల తర్వాత రీ సర్వే
98 ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ పాలకులు భూముల సర్వే చేసి వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములుగా విభజించి వాటిని రికార్డుల్లో ఎక్కించారు. అప్పటి నుంచి భూముల రీ సర్వే చేయలేదు. ఏళ్ల తరబడి ఉన్న రికార్డులు పాడువడం, భూముల మాయం, కచ్చితమై విస్తీర్ణం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి భూముల రీ సర్వే కోసం ప్రత్యేకమైన పథకం ప్రవేశపెట్టి ఉచితంగా రీ సర్వే చేయిస్తున్నారు. భూముల సర్వే చేయించి కొలతల ప్రకారం భూమి చుట్టూ సర్వే రాళ్లు వేయిస్తున్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే భూ హక్కు, రక్షణ పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
అధునిక పరికరాలతో రీ సర్వే
భూముల రీ సర్వే కోసం అధికారులు అధునిక పరికరాలను ఉపయోగించి సర్వే పనులు చేస్తున్నారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, ఇతర సిబ్బంది కలిసి ఒక టీంగా ఏర్పడి సర్వే చేసి వివరాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. భూముల రీసర్వే పనులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ల్యాండ్ అండ్ సర్వే శాఖ జిల్లా అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న సర్వే పనులు ఎప్పటికప్పుడు పరిశీలిన చేసి సర్వేపై సూచనలు, సలహాలు ఇస్తు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రభుత్వం గ్రామాల్లోని వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రైవేట్ భూములను ఉచితంగా రీ సర్వే చేసి, కచ్చితమైన విస్తరణతో భూములను చూపించి వాటికి సంబంధించి భూహక్కు, రక్షణ పత్రాలను అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలు, గొడవలకు చెక్ పెట్టేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
16 గ్రామాల రైతులకు పత్రాల పంపిణీ
రీసర్వేకు సంబంధించి ఫేజ్ 1లో 98 గ్రామాల్లో పనులు చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టుగా 16 గ్రామాల్లో పూర్తి చేశాం. ఈ గ్రామాలకు సంబంధించి 6,187 రైతులకు 5,656 జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టాం. భూహక్కు రక్షణ పత్రాలు అందుకున్న రైతులు వాటిలో తప్పులుంటే మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కరిస్తాం. మిగిలిన గ్రామాల్లో సర్వే పనులు వేగంగా చేయించి మూడు ఫేజ్‌ల్లో భూముల రీ సర్వే పనులు పూర్తి చేస్తాం.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment